సింగరేణి స్థలంలో అక్రమ నిర్మాణం.. పట్టించుకోని అధికారులు..

సింగరేణి సంస్థలోని భూములు అన్యాక్రాంతం కాకుండా ఒకపక్క ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం అనునిత్యం కృషి చేస్తూ, ఎప్పటికప్పుడు ఎస్టేట్ ఎస్ఎన్పీసీ అధికారులని, సిబ్బందిని అప్రమత్తం చేస్తూ విలువైన భూములను కాపాడుతున్నారు.

Update: 2024-12-29 12:31 GMT

దిశ, కొత్తగూడెం : సింగరేణి సంస్థలోని భూములు అన్యాక్రాంతం కాకుండా ఒకపక్క ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం అనునిత్యం కృషి చేస్తూ, ఎప్పటికప్పుడు ఎస్టేట్ ఎస్ఎన్పీసీ అధికారులని, సిబ్బందిని అప్రమత్తం చేస్తూ విలువైన భూములను కాపాడుతున్నారు. మరోపక్క ఎస్టేట్, ఎస్ఎన్పీసీ సిబ్బంది నిర్లక్ష్యంతో సింగరేణి స్థలాల్లో కొందరు వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. బాబు క్యాంపులోని శివాలయం పక్క వీధిలో, సింగరేణి క్వార్టర్ల మధ్య ఉన్న సుమారు 200 గజాల స్థలంలో కొందరు వ్యక్తులు అక్రమ నిర్మాణాన్ని చేపట్టారు. ఆరు నెలల క్రితం స్థానికులు ఫిర్యాదు చేయడంతో అక్రమ నిర్మాణం చేపట్టకుండా సింగరేణి అధికారులు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసి సదరు స్థలాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్లకుండా కాపాడారు.

నెల క్రితం అర్ధాంతరంగా సెక్యూరిటీ సిబ్బందిని తొలగించారు. దీంతో సింగరేణి స్థలంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేశారు. సింగరేణి సిబ్బంది సహకారంతోటే అక్రమ నిర్మాణం చేపట్టినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. తమకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని, ఎవరికి ఫిర్యాదు చేసినా తమకి ఏమీ కాదని నిర్మాణాలను చేపడుతున్న వ్యక్తి అనడం వెనక రాజకీయ నాయకుల హస్తం ఉందని సమాచారం. ఈ అంశం పై సింగరేణి కార్పొరేట్ ఎస్టేట్ జీఎంని వివరణ కోరగా విచారణ చేపడతామని తెలిపినప్పటికీ, ఎస్టేట్, ఎస్ఎన్పీసీ సిబ్బంది అక్రమ నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి చేరుకోకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి, అక్రమ నిర్మాణం పై విచారణ చేపట్టి సింగరేణి భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని పలు కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు.


Similar News