సమిష్టి కృషితో వేడుకలు ప్రశాంతం

పోలీసు శాఖ సమిష్టి కృషితో కొత్త సంవత్సరం వేడుకలు ప్రశాంతంగా జరిగాయని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా వ్యవహరించామని ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ బానాల శ్రీనివాసులు తెలిపారు.

Update: 2025-01-01 11:14 GMT

దిశ బ్యూరో, ఖమ్మం : పోలీసు శాఖ సమిష్టి కృషితో కొత్త సంవత్సరం వేడుకలు ప్రశాంతంగా జరిగాయని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా వ్యవహరించామని ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ బానాల శ్రీనివాసులు తెలిపారు. బుధవారం ఆయన ‘దిశ’తో మాట్లాడుతూ.. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా ప్రజలు కూడా పోలీసులకు సహకరించి తోడ్పాడునందించారని చెప్పారు. రాత్రి తొమ్మిది గంటల నుంచే నగరంలో సందడి మొదలైందని, తమ సిబ్బందితో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా నగర పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఎప్పటికప్పడు మానిటరింగ్ చేస్తూ ఇబ్బందులు తలెత్తకుండా చూశామన్నారు.

    జెడ్పీ సెంటర్, ఇల్లెందు క్రాస్ రోడ్, మమత రోడ్, పాత బస్టాండ్ తదితర ప్రాంతాల్లో మందుబాబులను కట్టడి చేసేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశామన్నారు. సైలెన్సర్ శబ్దాలతో న్యూసెన్స్ క్రియేట్ చేసిన కొందరిపై కేసులు నమోదు చేశామన్నారు. నగరంలో మొబైల్ పార్టీలతో పాటు ఎక్కడికక్కడ కూడళ్లలో పోలీస్ సిబ్బంది పర్యవేక్షిస్తూ ఎలాంటి ఘటనలు జరగకుండా ఎంతో కష్టపడ్డారని సిబ్బందిని అభినందించారు. గతంతో పోలిస్తే రోడ్ల మీదకు వచ్చి వేడుకలు చేసుకునే తీరు కొంత తగ్గిందని, 1 గంటవరకు బజార్లు ఫ్రీగా మారిపోయాయని తెలిపారు. వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, ఇతర ప్రాంతాల్లో ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా యువతతో పాటు.. ప్రజలు కూడా ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు జరుపుకున్నారని తెలిపారు.


Similar News