ప్రభుత్వ పథకాలు పేదల దరిచేరేలా కృషిచేయాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను అన్ని వర్గాల ప్రజల దరిచేరే విధంగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాంరెడ్డి, మహుబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ కోరారు.

Update: 2024-10-19 15:31 GMT

దిశ, కొత్తగూడెం రూరల్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను అన్ని వర్గాల ప్రజల దరిచేరే విధంగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాంరెడ్డి, మహుబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో శనివారం ఎంపీల అధ్యక్షతన దిశ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఆదివాసి గిరిజన గ్రామాలలోని గిరిజన కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న సంక్షేమ పథకాలు చేరే విధంగా సంబంధిత శాఖల అధికారులు బాధ్యతగా పనిచేయాలని కోరారు. బడుగు, బలహీన వర్గాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏడాది కొత్త కొత్త పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు బడ్జెట్ లో ఎక్కువ మొత్తం నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.

     ప్రభుత్వాలు ఎంత కష్టపడి పని చేసినా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుందని అన్నారు. పేదరిక నిర్మూలన, నిరక్ష్యరాస్యత, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థపై మరింత కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలో కరెంటు, మంచినీరు, రోడ్ల సమస్య లేకుండా చూడాలని కోరారు. అలాగే జిల్లా పరిషత్, గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మాతా శిశు కేంద్రాలలో అన్ని రకాల వసతులు తప్పనిసరిగా ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తప్పనిసరిగా వారి పరిధిలోని అన్ని సెంటర్లను తనిఖీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, మాలోతి రామ్​దాస్, జారే ఆదినారాయణ, దిశ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News