గండి గండం...సింగభూపాలెం ప్రాజెక్ట్ పదిలమేనా?

వరుసగా నాలుగు రోజుల పాటు కురిసిన భారీ వర్షాల కారణంగా సింగభూపాలెం ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది.

Update: 2024-09-10 11:29 GMT

దిశ, కొత్తగూడెం రూరల్ : వరుసగా నాలుగు రోజుల పాటు కురిసిన భారీ వర్షాల కారణంగా సింగభూపాలెం ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. దీనికి తోడు నిండుకుండ లాగా చెరువు కనిపించడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నా మరో పక్క చెరువుకు గండి గండం ఉన్నట్లుగా కనిపిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. సుజాతనగర్ మండల పరిధిలో ఉన్న సింగభూపాలెం చెరువుకు ప్రమాదం పొంచి ఉన్నట్లుగా కనిపిస్తుంది. భారీగా వరద నీరు చేరి చెరువు నిండుగా కనిపిస్తున్నప్పటికీ చెరువు కట్టకు బలం తగ్గి బీటలు వారడంతో పాటు క్రమ క్రమంగా కృంగుతుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

    చెరువు కట్ట పరిస్థితిని గమనించిన సుజాతనగర్ మండల సీపీఎం నాయకుల బృందం రెండు రోజుల కిందట దానిని పరిశీలించి చెరువుకు గండిపడకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. సింగభూపాలెం ప్రాజెక్టు చెరువు విస్తీర్ణం సుమారు 12 ఎకరాల పైబడి ఉంటుందని రైతులు పేర్కొన్నారు. ఈ చెరువు కింద 2250 ఎకరాలకు సాగు నీరు పారుతుంది. వ్యవసాయ సీజన్ సమయంలో చెరువుకు సంబంధించిన రెండు కాలువల ద్వారా నీరు పంట పొలాలకు అందుతుందని అన్నదాతలు తెలిపారు.

    సింగభూపాలెం ప్రాజెక్టు ద్వారా కొత్త అంజనాపురం, పాత అంజనాపురం, మేడిపల్లి, రూపుల తండా, నరసింహసాగర్, సర్వారం, హౌసింగ్ బోర్డు కాలనీ, వేపలగడ్డ, సుజాతనగర్, బృందావనం, మంగపేట, నాయకులగూడెం, డేగలమడుగు, చుంచుపల్లి పరిధిలో గల వ్యవసాయ భూములకు సాగునీరు పోతుంది. ఇన్ని ఊర్లకు సాగునీరు అందిస్తున్న సింగభూపాలెం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. మరలా భారీ వర్షాలు మొదలైతే చెరువుకు భారీ గండి పడే అవకాశం లేకపోలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

కట్ట ఇరువైపులా వాల్స్ కు పగుళ్లు....

సింగభూపాలెం చెరువు కట్టకు ఇరువైపులా కట్టిన వాల్స్ కు పగుళ్లు ఇచ్చాయి. ఈ కట్టమీద వరద నీరు నిల్వ ఉండకుండా చిన్నపాటి వాల్స్ నిర్మించి కాలువలు ఏర్పాటు చేశారు. అయితే వాల్స్ కు పగుళ్లు వచ్చినందున వరద నీరు తిరిగి చెరువులోకి వెళ్లే అవకాశం ఉంది. దీనివల్ల కట్టకి మరింత ప్రమాదం పొంచి ఉంది. కట్ట ఈ చివరి నుండి ఆ చివరి వరకు వర్షాల కారణంగా బురదమయంగా మారడంతో రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంది.

చెరువుకు గండి పడకుండా చూడాలి : రైతు నాగేశ్వరరావు

భారీ వర్షాలు మళ్లీ కురిస్తే సింగభూపాలెం చెరువుకు ప్రమాదం పొంచి ఉన్నందున ముందస్తుగా చర్యలు చేపట్టాలి. చెరువు కట్టకు పూర్తిగా ప్రొటెక్షన్ వాల్ ఏర్పాటు చేయాలి. వర్షాకాలం సీజన్ అయిపోయేంతవరకు ప్రాజెక్టుపై అధికారుల పర్యవేక్షణ ఉండాలి.

శాశ్వత ప్రొటెక్షన్ వాల్ ఏర్పాటు చేయాలి : వీర్ల రమేష్, సుజాతనగర్ సీపీఎం మండల నాయకులు

సింగభూపాలెం ప్రాజెక్టుకు శాశ్వత ప్రొటెక్షన్ వాల్ ఏర్పాటు చేయాలి. వర్షాలు ప్రారంభం కాకముందే సింగభూపాలెం చెరువుకు రక్షణ చర్యలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశాం. అధికారులు మాత్రం మేల్కొనలేదు. మళ్లీ భారీ వర్షాలు కురిస్తే చెరువు కట్ట తెగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టాం : ఇరిగేషన్ డీఈ భాస్కరరావు

ఇటీవల కురిసిన వర్షాల కారణంగా సింగభూపాల చెరువు కట్ట కొద్దిపాటి బీటలు వారి కుంగింది. విషయాన్ని గమనించి తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టాం. వర్షాలను దృష్టిలో పెట్టుకొని సింగభూపాలెం ప్రాజెక్టు వద్ద ఎప్పటికప్పుడు పర్యవేక్షణ నిర్వహిస్తున్నాం.

Tags:    

Similar News