ఇంటి రుణం ఇప్పిస్తామని మోసం..అక్రమంగా రూ. లక్షకు పైగా వసూలు..

తనకు ఇంటి రుణం ఇప్పిస్తానని వైరా మండలానికి చెందిన ఇద్దరు దళారులు

Update: 2024-10-03 14:56 GMT

దిశ, వైరా : తనకు ఇంటి రుణం ఇప్పిస్తానని వైరా మండలానికి చెందిన ఇద్దరు దళారులు మోసం చేశారని కొణిజర్ల మండలం పల్లిపాడు గ్రామానికి చెందిన బాధితుడు గంధం నగేష్ తెలిపారు. నకిలీ డెత్ సర్టిఫికెట్ల తో ఇంటి రిజిస్ట్రేషన్ చేసిన విషయమై గురువారం దిశ దినపత్రికలో "నకిలీ డెత్ సర్టిఫికెట్ల బాగోతం" అనే వార్త కథనం ప్రచురితమైంది . దీంతో ఇంటి రిజిస్ట్రేషన్ చేయించుకున్న గంధం నగేష్ దిశ తో మాట్లాడారు. వైరా మండలానికి చెందిన ఇద్దరు దళారులు తన ఆర్థిక బాధలను ఆసరాగా చేసుకుని ఇంటి రుణం మంజూరు చేయిస్తామని చెప్పారని పేర్కొన్నారు. అందుకు అవసరమైన సర్టిఫికెట్లన్నీ తామే సమకూరుస్తామని వారు స్పష్టం చేశారని వివరించారు. ముందుగా తన వద్ద ఖాళీ ప్రామిసరీ నోటు పై సంతకాలు తీసుకుని తామే ఇంటి రుణం అవసరమైన పెట్టుబడి పెడుతున్నామని చెప్పారని స్పష్టం చేశారు. సత్తుపల్లి మండలం పేరుతో ఉన్న తమ కుటుంబ ఆధార్ కార్డులను సైతం సదరు దళారులే పల్లిపాడుకు మార్చారన్నారు.

రుణానికి అవసరమైన తమ తల్లిదండ్రుల డెత్ సర్టిఫికెట్లను తామే తీసుకుంటామని దళారులు చెప్పారని పేర్కొన్నారు. దళారులే నకిలీ డెత్ సర్టిఫికెట్లు తయారు చేయించి ఈ ఏడాది జులై 19 వ తేదీన తన పేరు పై ఇంటి రిజిస్ట్రేషన్ చేయించారన్నారు. ఇంటి రిజిస్ట్రేషన్ తర్వాత తమ ఇంటిని రెండు ఫైనాన్స్ కంపెనీల వారు పరిశీలించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను తనిఖీ చేశారని చెప్పారు. ఆ సమయంలోనే నకిలీ డెత్ సర్టిఫికెట్లతో ఈ ఇంటిని రిజిస్ట్రేషన్ చేశారని, తాము ఇంటికి రుణం ఇవ్వలేమని ఆ ఫైనాన్స్ కంపెనీ వారు స్పష్టం చేశారు. అనంతరం ఆ ఇద్దరు దళారులు ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ నుంచి తనుకు రూ. 4 లక్షల ఇంటి రుణం మంజూరు చేయించారని వివరించారు. ఆ రుణం ఇచ్చిన వెంటనే దళారులు ఇద్దరు తన వద్ద నుంచి ఒక లక్ష అయిదు వేల రూపాయలను అక్రమంగా వసూలు చేశారని పేర్కొన్నారు. 60 నెలల వాయిదాతో నెలకు రూ.11566 ఈఎంఐ కట్టే విధంగా ఈ రుణాన్ని మంజూరు చేశారన్నారు.

వైరా మండలానికి చెందిన యాలాద్రి, వెంకన్న తమ వద్ద నగదును అక్రమంగా వసూలు చేశారని వివరించారు. ఇంటి రిజిస్ట్రేషన్ సంబంధించిన నకిలీ డెత్ సర్టిఫికెట్లు సృష్టించడంలో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. సర్టిఫికెట్లు తామే చూసుకుంటామని చెప్పి సదరు దళారులు నకిలీ సర్టిఫికెట్లు తయారు చేశారని వివరించారు. తనకు జరిగిన అన్యాయంపై కొణిజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశానని స్పష్టం చేశారు. ఇంటి రుణం పేరుతో తనను మోసం చేసిన వారిపై పోలీసులు చట్టపరంగా చర్య తీసుకోవాలని కోరారు.


Similar News