సీసీఐ ద్వారానే రైతులకు మద్దతు ధర లభిస్తుంది : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రైతులు తమ పండించిన పత్తిని దళారుల చేతిలో మోసపోకుండా

Update: 2024-10-21 07:10 GMT

దిశ, ఖమ్మం రూరల్: రైతులు తమ పండించిన పత్తిని దళారుల చేతిలో మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం సీసీఐ ద్వారా పత్తిని సేకరిస్తున్నట్లు, పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని గుర్రాల పాడు సమీపంలో గల జీఆర్ఆర్ జిన్నింగ్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి తుమ్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు కనీస మద్దతు ధర పొందాలంటే 12 శాతం తేమ ఉండేవిధంగా చూసుకొని రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని తెలిపారు. దళారుల చేతిలో మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం సిసిఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఈరోజు మొదటి కొనుగోలు కేంద్రం అని ఆయన తెలిపారు.

రైతులు ద్వారానే వస్తే పత్తిని సిసిఐ అధికారులు కొనుగోలు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. రైతుల మాటున వ్యాపారులు వస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా రైతులు వర్షాల వలన పత్తి పంట పూర్తిగా దెబ్బతిన్నదని సాధారణంగా 10 గంటలు వచ్చే పత్తి ప్రస్తుతం నాలుగు గంటలకు పడిపోయిందని దీనిని అధిగమించేందుకు ప్రత్యాయ పంటగా ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారించాలని ఆయన రైతులను కోరారు . రైతులు ఆయిల్ పామ్ సాగు వలన ఎటువంటి చీడపీడలు ఆశించకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట ఎక్కువ లబ్ధి పొందవచ్చు అని ఆయన రైతులకు సూచించారు. ప్రోత్సాహం కూడా అందిస్తుందని తెలిపారు.

అధిక వర్షాల వల్ల పంట దిగుబడి తగ్గి రైతులు కష్టాల్లో ఉన్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారని ప్రతి జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ రాయల నాగేశ్వరావు మద్దులపల్లి మార్కెట్ చైర్మన్ బైరు హరినాథ్ బాబు, వైస్ చైర్మన్ వనవాసం నరేందర్ రెడ్డి జిల్లా మార్కెట్ కమిటీ కార్యదర్శి అలీ మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఆంజనేయులు స్థానిక నాయకులు మద్ది మల్లారెడ్డి , అంబటి సుబ్బారావు, తమ్మినేని నవీన్, తేజావత్ పంతులు నాయక్ కర్లపూడి భద్రకాళి, వెంకటనారాయణ తదితరులు ఉన్నారు.


Similar News