ఆపరేషన్ కగార్ పేరుతో గిరిజనుల పై మారణహోమం..

ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల పై మారణహోమం సృష్టిస్తున్నారని, మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో మావోయిస్టులు సోమవారం ఒక లేఖను విడుదల చేశారు.

Update: 2024-10-21 09:33 GMT

దిశ, భద్రాచలం : ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల పై మారణహోమం సృష్టిస్తున్నారని, మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో మావోయిస్టులు సోమవారం ఒక లేఖను విడుదల చేశారు. విప్లవకారుల హత్యలకు వ్యతిరేకంగా ఈ నెల 21, 22 తేదీలు రెండు రోజులు దేశవ్యాప్తంగా నిరసన దినోత్సవాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మారణహోమంలో భాగంగా సెప్టెంబర్ 23న కకూర్ - పారాడి వద్ద, అక్టోబర్ 4న తుల్తులీ - గవాడి వద్ద బలగాలు దాడులు నిర్వహించాయని, ఈ రెండు దాడుల్లో 38 మంది మావోలు శత్రువులతో పోరాడుతూ ప్రాణాలు అర్పించారని లేఖలో పేర్కొన్నారు.

కాకూర్ - పారాడి దాడిలో డీకేఎస్జెడ్సీ సభ్యుడు రూపేష్, డీవీసీ సభ్యుడు జగదీష్ మరణించగా, అక్టోబర్ 4న తుల్తులి - గవాడి దాడిలో కామ్రేడ్ సరితతో పాటు డీకెఎస్జెడ్సీ సభ్యులు నీతి, డీవీసీ మురళి, మహేష్, సురేష్, మీనా సహా మొత్తం 35 మంది సహచరులు వీరమరణం పొందగా ఈ రెండు దాడుల్లో అమరులైన 38 మంది సహచరులకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఘనంగా నివాళులు అర్పించినట్లుగా పేర్కొన్నారు. ప్రపంచంలోని అందరు ప్రజలు, ప్రజాస్వామ్య, ప్రగతిశీల సంస్థలు, గిరిజన సంస్థలు, మానవ హక్కుల సంస్థలు, వామపక్ష పార్టీలు, శక్తులు నిరసన తెలపాలని విజ్ఞప్తి చేశారు.


Similar News