దర్జాగా కబ్జా..ఒకరు ఫామ్ హౌస్ చేపడితే..మరొకరు వెంచర్ ఏర్పాటు

ముదిగొండ మండలం సువర్ణపురం రెవెన్యూ పరిధిలోని

Update: 2024-11-30 02:22 GMT

దిశ, ముదిగొండ: ముదిగొండ మండలం సువర్ణపురం రెవెన్యూ పరిధిలోని న్యూ లక్ష్మీపురం గ్రామ సమీపంలోని సర్వే నెంబరు 417 లో 1.20ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమి విలువ కోట్ల రూపాయలు పలుకుతున్నది. ఆ ప్రభుత్వ భూమి పక్కనే ఉన్న కొంతమంది వ్యక్తులు అదునుగా భావించి దర్జాగా ఆక్రమించి అందులో ఫామ్ హౌస్ నిర్మించారు. సొంత భూమిలో ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే ఆ గ్రామానికి సంబంధించిన పంచాయతీ నుంచి అనుమతులు తీసుకుని గ్రామపంచాయతీకి అనుమతి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ భూమిలో వ్యవసాయం చేసుకోవడానికి తప్ప, ఎలాంటి నిర్మాణం చేపట్టడానికి అనుమతులు ఉండవు. అలాంటిది ఏకంగా సదరు వ్యక్తి ఫామ్ హౌస్‌ను నిర్మించి దర్జాగా రాజభోగాలు అనుభవిస్తున్నాడు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఏకంగా నిర్మాణమే చేపడుతుంటే స్థానిక అధికారులు ఏం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా పక్కనే ఉన్న మరొక వ్యక్తి ప్రభుత్వ భూమిని ఆక్రమించి వెంచర్ నిర్మాణం చేశారు. ఆ భూమి వెంకటగిరి టు వల్లభి ప్రధాన రహదారి పక్కన ఉండటంతో ఆ భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. ఇదే అదునుగా భావించి కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కలుపుకుని వెంచర్ నిర్మాణం చేశారు. ప్రభుత్వ భూమిని కలుపుకుని వెంచర్ నిర్మాణం చేయడానికి అనుమతులు ఎలా ఇచ్చారు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. వాళ్లేంటి ఆక్రమించేది నేను ఆక్రమిస్తా అని సదరు వ్యక్తి పక్కనే ఉన్న పట్టాదారు.. ప్రభుత్వ భూమిని ఆక్రమించి కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేశాడు. ప్రభుత్వ భూమి పక్కనే ఉన్న 415 సర్వేనెంబర్ గల ఇద్దరు వ్యక్తులు ప్రభుత్వ భూమిని కలుపుకొని ఏకంగా చుట్టూ పారి గోడలు నిర్మించారు.

ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. వీళ్లంతా ఒకరిని చూసి మరొకరు ప్రభుత్వ భూమిని కలుపుకొని ప్రభుత్వాన్ని మోసం చేస్తూ,ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటున్నారు. వీటిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన అధికారులు చూసినట్లు వ్యవహరిస్తున్నారు. అధికారుల పని తీరును చూస్తే పలు అనుమానాలకు దారి తీస్తున్నాయని మండల ప్రజల్లో గుసగుసలు వినపడుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని ఆక్రమించిన అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకొని, ప్రభుత్వ భూమిని కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు.


Similar News