అష్ట వంకరలుగా కాలువలు..

మున్సిపాలిటీలో నూతన కాలువల నిర్మాణం కొందరు

Update: 2024-11-30 02:29 GMT

దిశ, కొత్తగూడెం : మున్సిపాలిటీలో నూతన కాలువల నిర్మాణం కొందరు రాజకీయ నాయకులకు, అధికారులకు కాసుల పంట పండిస్తున్నాయి. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని తాతారెడ్డి బిల్డింగ్ నుంచి బర్మ క్యాంపునకు వెళ్లే రహదారిపై కాలువాలు నిర్మిస్తున్నారు. ఆ రోడ్డు నుంచి సమానంగా ఉండవలసిన కాలువలను, వంకర టింకరగా నిర్మిస్తున్నారు. రోడ్డు పక్కన ఇండ్లు ముందుకు ఉంటే కాల్వలను ముందుకు, రోడ్డుకు ఇండ్లు వెనకకు ఉంటే కాలువలను వెనక్కి జరిపి నిర్మించేస్తున్నారు. ఇంటి యజమానులతో కొంతమంది అధికారులు ఒప్పందం చేసుకొని, రోడ్డుపైకి ముందుకు వచ్చిన నిర్మాణాలను కూల్చకుండా, నిబంధనలకు విరుద్ధంగా వంకరటింకరగా కాలువలను నిర్మిస్తున్నట్లు సమాచారం.

అధికారులపై కొందరు రాజకీయ నాయకులు ఒత్తిడి తీసుకువచ్చి వారికి కావలసిన వారికి అనుకూలంగా కాలువలు నిర్మించాలని, కాలువల నిర్మాణానికి అడ్డంగా ఉన్న వారి అనుచరుల ఇండ్ల గోడలను కూల్చకుండా అధికారులపై బెదిరింపులకు గురి చేస్తున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. దీంతో అధికారులు, రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా కాలువలు నిర్మిస్తున్నారని మున్సిపాలిటీ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కొందరు రాజకీయ నాయకులకు, మరి కొందరు అధికారులకు ఈ కాలువల నిర్మాణం కాసుల పంట పండిస్తుందని బహిరంగ చర్చ జరుగుతోంది. ఈ వంకర టింకర కాలువలతో భవిషత్‌లో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు .ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ కాలువ నిర్మాణాలపై దృష్టి సారించి, తాత రెడ్డి బిల్డింగ్ నుంచి బర్మా క్యాంపు మూలమలుపు వరకు వంకరగా ఉన్న చోట కాల్వలను కూల్చి మరల నూతనంగా నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.


Similar News