సంక్షేమ పథకాల పేరుతో సైబర్ వల..అనర్హులపై వారి చూపు

సైబర్ నేరగాళ్లకు సంక్షేమ పథకాలు మరో అవకాశం గా మారాయి.

Update: 2025-01-24 02:07 GMT
సంక్షేమ పథకాల పేరుతో సైబర్ వల..అనర్హులపై వారి చూపు
  • whatsapp icon

దిశ, ఇల్లందు : సైబర్ నేరగాళ్లకు సంక్షేమ పథకాలు మరో అవకాశం గా మారాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలపై నిర్వహిస్తున్న గ్రామ సభలకు సంబంధించి అనర్హులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. తమను అర్హులుగా గుర్తించాలంటూ గ్రామ సభల్లో వేడుకుంటున్నారు. ఈ విషయాలపై దృష్టి సారించిన సైబర్ నేరగాళ్లు. అనర్హులను గుర్తించి వారి సెల్‌ఫోన్‌లకు ప్రభుత్వం తరఫున మెసేజ్ రూపంలో పంపిస్తున్నారు. ఇలా పంపించిన మెసేజ్‌లకు సంబంధించి ఓటీపీలు చెబితే వెంటనే రేషన్ కార్డులకు, ఇందిరమ్మండ్లకు, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా వంటి పథకాలకు అర్హులవుతారని మెసేజ్ లు చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం ఇటువంటి మెసేజ్‌లు పంపించడం లేదు. ఇలా ఓటీపీలు సైతం అడగదు. కానీ ప్రస్తుతం సంక్షేమ పథకాలపై పరుగులు తీస్తున్న ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయనే అమాయకంతో మెసేజులు క్లిక్ చేసి, ఓటీపీలు చెబితే ప్రజలు మోసపోయే అవకాశం ఎంతైనా ఉంది.

పట్టణంలోని ఏడో వార్డులో పలువురికి మెసేజులు వచ్చినట్టు స్థానిక వార్డు కౌన్సిలర్ శ్యామల మాధవి రవితేజ దిశకు సమాచారం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా బర్నింగ్ ఇష్యూ అయినా సంక్షేమ పథకాల లబ్ధిదారుల విషయం సైబర్ నేరగాళ్లు తమకు అనువుగా మార్చుకునేందుకు ప్రజలపై కన్నేసినట్లు తెలుస్తోంది. ప్రజలు సైబర్ నెరగాళ్ల వలలో పడొద్దని, వచ్చే మెసేజ్లు, ఫోన్‌లకు రెస్పాండ్ కావొద్దని ఇల్లెందు సీఐ బత్తుల సత్యనారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అవగాహన కల్పిస్తేనే..

సైబర్ నేరగాళ్ల వలలో సంక్షేమ పథకాల రూపంలో అమాయక ప్రజలు చిక్కకుండా ప్రభుత్వం, అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో అనేక మంది ప్రజలు సంక్షేమ పథకాల అర్హులుగా గుర్తింపునకు నాయకులు, అధికారులు, కమిటీ సభ్యుల వెంట ప్రదక్షిణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ప్రభుత్వం నుంచి మెసేజ్ వచ్చినట్లుగా ప్రజలు భావించి మెసేజ్లు క్లిక్ చేసినా, ఓటీపీలు చెప్పిన అమాయక ప్రజలు బలికావడం తప్పదు.

ప్రభుత్వం నుంచి ఎటువంటి మెసేజ్‌లు రావు : ఇల్లందు మున్సిపల్ కమిషనర్, శ్రీకాంత్

సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం నుంచి ఇటువంటి మెసేజ్‌లు రావు. ప్రజలు ఎవరూ మెసేజ్‌లకు రెస్పాండ్ కావొద్దు. ఓటీపీలు చెప్పవద్దు. ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు ఫోన్ చేయాలి. లేదా కార్యాలయానికి వచ్చి సంప్రదించాలి.


Similar News