CM Revanth Reddy : బీఆర్ఎస్‌కు మిగిలింది గాడిద గుడ్డే
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మిగిలింది గాడిద
దిశ, వైరా : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మిగిలింది గాడిద గుడ్డేనని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తనకు కాంగ్రెస్ కార్యకర్తలు అండగా నిలబడాలని, బీఆర్ఎస్ ను బద్దలు కొట్టి బొంద పెట్టే బాధ్యత తనదని చెప్పారు. ఖమ్మం జిల్లా వైరా లోని న్యూ లిటిల్ ఫ్లవర్ పాఠశాల సమీపంలో గురువారం రైతు సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడో విడత రెండు లక్షల రుణమాఫీ ను ప్రారంభించారు. అనంతరం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అధ్యక్షతన జరిగిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 2014,2018, 2023 సంవత్సరాల్లో వరుసగా జరిగిన ఎన్నికల్లో ఖమ్మం ప్రజలు బి ఆర్ ఎస్ కు ఒక్క సీటు మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. 2023 ఎన్నికల్లో గెలిచిన ఒక్క బిఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా ఇందిరమ్మ పరిపాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ కు మద్దతు తెలిపారని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మిగిలింది గాడిద గుడ్డేనని ఎద్దేవా చేశారు.
అయినప్పటికీ సిగ్గు తప్పినోళ్ల మాటలు మారలేదని పేర్కొన్నారు. అబద్ధాలు చెప్పుకుంటూ బావ బామ్మర్దులు తిరుగుతున్నారని కేటీఆర్, హరీష్ రావు లను విమర్శించారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు తనకు అండగా నిలబడాలని, బీఆర్ఎస్ ను బద్దలు కొట్టి బొంద పెట్టే బాధ్యత తనదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సమూలంగా నేలమట్టంగా బీఆర్ఎస్ ను పెకిలించి బంగాళాఖాతంలో విసిరే బాధ్యత తాను తీసుకుంటానని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ను బద్దలు కొట్టడం బిజెపిని బొంద పెట్టడం పెద్ద సమస్య కాదన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బిజెపికి 8 సీట్లు ఇస్తే బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు 2026 ఆగస్టు 15వ తేదీ కల్లా సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు నిధులను వరదలా పారిస్తామని పేర్కొన్నారు.
కృష్ణా నది జలాలు పారకముందే గోదావరి నీటిని కృష్ణ కాలువల్లో పారించాలనేదే తమ ఆలోచన అన్నారు . మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి మేరకు డోర్నకల్ లో వీరభద్రుడి పేరుమీద 15 టీఎంసీల రిజర్వాయర్ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆగస్టు 15వ తేదీ లోపు రైతులుకు రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు గతంలో సవాల్ విసిరారని సీఎం గుర్తు చేశారు. హరీష్ రావుకు చీము నెత్తురు సిగ్గు శరం ఉంటే వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీకు సిగ్గులేని వాడివైతే ఏటిలో పడి చావాలన్నారు. హరీష్ రావుది సిగ్గులేని జాతి అని, అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో 39, పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా సీట్లు ప్రజలు ఇచ్చినా కేటీఆర్ బుద్ధి మారలేదన్నారు.
బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు లేని విధంగా దీనంగా దివాలా తీసి ఆ పార్టీ బతుకు బస్టాండ్ అయిందన్నారు. ఖమ్మంలోని మున్నేరి నదిలో గ్రావిటీ ద్వారా 32 టీఎంసీలు నీటిని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు రామ సహాయం రఘురాం రెడ్డి బలరాం నాయక్, పలు కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.