ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీఆర్​ఎస్​ ప్రయత్నం

బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

Update: 2024-12-15 10:49 GMT

దిశ, ఖమ్మం : బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.‌‌ బీఆర్ఎస్ పాలనలో రూ‌.7 లక్షల కోట్ల అప్పులు చేశారని తెలిపారు. అలాంటి వారు ఈరోజు మాట్టాడుతున్న తీరు చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. వివిధ శాఖల్లో ఉద్యోగులు దాచుకున్న డబ్బులపై కూడా అప్పులు చేశారన్నారు. వారు చేసిన అప్పులతో ప్రతినెలా రూ. 541 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందన్నారు.

    రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వాలు చేసిన అప్పులను బహిరంగంగా చూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వారు అప్పులు చేసి తిన్నారని, తాము సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఏడాదిలోపు రూ. 21 వేల కోట్ల రుణమాఫీని రైతు ఖాతాలో వేస్తామన్నారు. తాము ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని చెప్పారు. కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్ల రూపాయలను మింగారని విమర్శించారు. విలేకరుల సమావేశంలో డీసీసీ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, నాయకులు పాల్గొన్నారు. 


Similar News