బీటెక్ బేరాలు షురూ!.. యాజమాన్య కోట సీట్ల అమ్మకాలు ప్రారంభం

ఎంసెట్ ఫలితాలు వచ్చాయో లేదో అప్పుడే బీటెక్ సీట్ల అమ్మకాలూ మొదలయ్యాయి.

Update: 2023-06-26 02:07 GMT

దిశ, ఖమ్మం బ్యూరో: ఎంసెట్ ఫలితాలు వచ్చాయో లేదో అప్పుడే బీటెక్ సీట్ల అమ్మకాలూ మొదలయ్యాయి. మొదట కౌన్సెలింగ్ ప్రకారం భర్తీ అయ్యాక.. మిగతా సీట్లు మేనేజ్‌మెంట్ కోటాలో ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజు ప్రకారం అడ్మిషన్లు తీసుకోవాల్సింది పోయి.. కొన్ని ప్రైవేట్ కళాశాలలు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నాయి. డిమాండ్ ఉన్న కోర్సులకు అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. ఎవరు అధిక ఫీజు చెల్లిస్తే వారికే సీటు అన్నట్లు గా వ్యవహరిస్తున్నాయి. ఈ తతంగం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నా ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదు. మధ్య తరగతి విద్యార్థులకు మేనేజ్‌మెంట్ ఫీజులు గుదిబండగా మారుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు విద్యను భారీగా అమ్ముకుంటున్నాయి. యాజమాన్య కోటా సీట్లను లక్షలు ఇచ్చిన వారికే కట్టబెడుతున్నాయి. ఒక్కోసీటు లక్షల్లోనే అమ్ముకుంటున్నారు. దీంతో సీటు రాక మేనేజ్‌మెంట్ కోటాలో జాయిన్ అవుదామనుకునే మధ్య తరగతి వారి కల నెరవేరడం లేదు. ప్రైవేట్ ఏజెన్సీలు, పీఆర్వోల ద్వారా బేరసారాలకు దిగుతున్నారు. తమ కాలేజీలోని ఉన్న ఫెసిలిటీలను గొప్పగా చూపుతూ వారిని బుట్టలో వేసుకుంటున్నారు. తమ కాలేజీలో చదివితే భవిష్యత్ బాగుంటుందంటూ ఆశకల్పించి.. తర్వాత ఎలాగైనా సీటు తీసుకునేలా మాయమాటలు చెబుతున్నారు. చివరికి లక్షల్లో సీటు కేటాయిస్తూ తమ దందా కొనసాగిస్తున్నారు.

కన్సల్టెన్సీలతో బేరసారాలు..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మేనేజ్‌మెంట్ కోటా సీట్ల అమ్మకాల దందా జోరుగా సాగుతున్నది. ఎంసెట్ ఫలితాలు ఆధారంగా సంబంధిత విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మేనేజ్ చేసే పనిలో పడ్డాయి కొన్ని కన్సల్టెన్సీలు. అంతేకాదు పలు కాలేజీలు తమ పీఆర్వోల ద్వారా తమ పని కానిచ్చేస్తున్నాయి. మాయమాటలతో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను బుట్టలో వేసుకుని అధిక ఫీజులకు సీట్లు అమ్ముకుంటున్నాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థులే లక్ష్యంగా సీట్ల బేరసారాలకు దిగుతున్నారు.

ఒక్కో సీటు లక్షల్లోనే..

పలు ఇంజినీరింగ్ కాలేజీలు ఒక్కో సీటును లక్షల్లోనే అమ్ముకుంటున్నాయి. డిమాండ్ కోర్సులను బూచీగా చూపి ఎంసెట్‌లో ర్యాంకురాని వారికి మేనేజ్ మెంట్ కోటాపై ఆశలు కల్పిస్తున్నాయి. ఆ తర్వాత మాయమాటలతో కాలేజీలో ఎలాగైనా జాయిన్ అయ్యేలా చేస్తున్నారు. కొంతమంది మధ్య తరగతి వారైతే తమకు సీటు రాక.. మేనేజ్ మెంట్ కోటాలో లక్షలు ధారపోసి చదవలేక సతమతం అవుతున్నారు. ఏది ఏమైనా యాజమాన్య కోటా సీట్లకు కృత్రిమ డిమాండ్ కల్పించి అమాయకులు భారీగా అమ్ముకుంటున్నారు.

నిబంధనలు బేఖాతర్..

యాజమాన్య సీట్లు సైతం నిబంధనల మేరకు భర్తీ చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నా.. పలు కాలేజీలు మాత్రం నిబంధనలు పూర్తిగా తుంగలో తొక్కి మేనేజ్‌మెంట్ కోటా భర్తీ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి యాజమాన్య కోటా సీట్లు కౌన్సిలింగులు పూర్తయిన తర్వాత మిగతా వాటిని భర్తీ చేయాల్సి ఉంది.. కానీ ఎంపెట్ ఫలితాలు వచ్చాయో లేదో.. కాన్సిలింగ్ లు పూర్తి కాకముందే భర్తీ చేస్తున్నారు. కొన్నిచోట్ల అడ్వాన్సు బుకింగ్ పేరిట కూడా సీట్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారు స్పందించకపోవడం గమనార్హం.

Tags:    

Similar News