ఆర్యవైశ్య పెద్దల్లో కలవరం.. ఆదాయం, సంఘం లెక్కల పై గప్‌చుప్..
ఆర్యవైశ్య పెద్దలు అని చెప్పుకుంటూ సంఘ ఆస్తులను సొంతానికి వాడుకున్న వారిలో కలవరం మొదలైంది.
ఆర్యవైశ్య పెద్దలు అని చెప్పుకుంటూ సంఘ ఆస్తులను సొంతానికి వాడుకున్న వారిలో కలవరం మొదలైంది. దిశ ప్రచురించిన ‘అంతర్గత కుమ్ములాటలు’, వనభోజనాల వసూళ్లు పై ఆర్యవైశ్య మహాసభ సంఘాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఆర్యవైశ్య అభ్యున్నతికి ఉపయోగపడాల్సిన ఆస్తులను కొందరు పెద్దలు వైట్ కాలర్ ముసుగులో వాటిని ఇష్టానికి వాడుకోవడమే కాక సొంత ఆస్తులుగా పెత్తనం చేస్తూ.. వాటి పై వచ్చే ఆదాయం లెక్కలు గురించి ఎవరికీ తెలియనీయకుండా చేశారనే ఆరోపణలు వినపడుతున్నాయి. వీటి పై ఎప్పుడు.. ఎవరు ప్రశ్నిస్తారో అంటూ లోలోన అంతర్మథనం పడుతున్నారు. ఒక ఐదుగురు కొన్నేళ్లుగా జట్టుగా ఏర్పడి.. ఆర్యవైశ్య ఆస్తులను తామే కాపాడుతూ.. వైశ్యులకు న్యాయం చేసేది తామే అన్నట్టు బీరాలు పోతూ ఆస్తులను కరిగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వారందరూ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తున్నది.
దిశ, ఖమ్మం సిటీ : ఆర్యవైశ్య పెద్దలు అని చెప్పుకుని సంఘ ఆస్తులను సొంతానికి వాడుకున్న వారిలో కలవరం మొదలైంది. దిశ ప్రచురించిన అంతర్గత కుమ్ములాటలు, వనభోజనాల వసూళ్ల పై ఆర్యవైశ్య మహాసభ సంఘాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఇప్పటికే ఆర్యవైశ్య పెద్దలు కొందరు పేద వైశ్యులకు అందాల్సిన సేవలను, అవసరాలను వారికి అందనీయకుండా చేసిన వారి పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్యవైశ్య అభ్యున్నతికి ఉపయోగపడాల్సిన ఆస్తులను కొందరు పెద్దలు వైట్ కాలర్ ముసుగులో వాటిని ఇష్టానికి వాడుకోవడమే కాక సొంత ఆస్తులుగా పెత్తనం చేస్తూ.. వాటి పై వచ్చే ఆదాయం లెక్కల గురించి ఎవరికీ తెలియనీయకుండా చేశారనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఇటీవల ఒకరిద్దరూ పెద్ద వ్యాపారవేత్తలుగా నగరంలో పేరు తెచ్చుకొని ప్రజల సొమ్మును దోచుకుని ఐపీ దాఖలు చేసిన పరిస్థితి వెనుక ఈ పెద్దల హస్తం ఉన్నట్లు విమర్శలు వినపడుతున్నాయి.
ఒక ఐదుగురు జట్టుగా సుమారు 30 నుంచి 35 ఏళ్లుగా దోస్తీ చేస్తూ... ఆర్యవైశ్య ఆస్తులను కాపాడుతూ.. వైశ్యులకు న్యాయం చేసేది తామే అన్నట్టు బీరాలు పోతూ ఇప్పుడు వాటిని కరిగిస్తున్నట్లు విమర్శలు ఊపందుకున్నాయి. ఈ పెద్దలను ఎవరు ఎప్పుడు ప్రశ్నిస్తారోనని లోలోన కలవరం పడుతున్నట్లు తెలుస్తోంది. రూ.కోట్లు విలువ చేసే ఆస్తులను పేద వైశ్యుల అవసరాలకు ఉపయోగించకుండా ఇంకా వారి వద్దే ఉంచుకొని ఎలాంటి వడ్డీలు చెల్లించుకోకుండా సొంతానికి వాడుతూ వారి వ్యాపారాలను మూడు పూలు ఆరుకాయలుగా నడుపుకుంటున్నారనేది బహిరంగ చర్చ నడుస్తోంది. కొన్నేళ్ల క్రితం చిన్నచిన్న వ్యాపారులుగా ఉన్న వీరు మాల్స్, బ్యాంకులు, బిల్డర్లుగా, మరికొన్ని ప్రైవేటు సంస్థలకు చైర్మన్, అధ్యక్షుల హోదాల్లో కీర్తి గడిస్తున్నారు.
వైశ్యులకు వ్యాపారమే వృత్తి కాబట్టి కొంతమంది చిన్న, మధ్యతరగతి కుటుంబాలను ఎంచుకుని వారికి చిన్న మొత్తాల్లో డబ్బులు ఇచ్చి, వడ్డీలు వసూలు చేస్తూ.. వాటి ద్వారా సేవలు చేస్తున్నామని డంబాలు పోతూ సోషల్ మీడియాలో ప్రకటనలు చేస్తూ.. చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ఇదో మార్గంలా ఎంచుకున్నట్లు సంఘంలోని కొందరు పేర్కొంటున్నారు. ఆర్యవైశ్య ఆస్తుల్లో ఒక్కటైన సుగ్గల వారి తోటలో గల నర్సింగ్ హాస్టల్ స్థలాన్ని కూడా సొంతానికి వాడుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటి వరకు కొన్నేళ్లుగా ఆ భవనాన్ని కొంతమంది కులపెద్దల చేతుల్లో పెట్టి రెంట్లు వసూలు చేస్తున్నమని చెబుతున్నారు. అంతే తప్ప ఇప్పటి వరకు దాని నుంచి వచ్చిన ఆదాయంతో ఎక్కడైనా ఏమైనా జమ చేశారా లేదా లెక్కలు ఎవరికి తెలియదంటే వారి అజమాయిషి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటిని ప్రశ్నిస్తే వారి పై సొంత సైన్యంతో విమర్శలు గుప్పిస్తూ.. ప్రతి ఒక్కరు అడిగే వారేనా అన్న హెచ్చరికలు ఇప్పిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. రూ.వందలు, వేలు ఖర్చు చేస్తూ.. లక్షల్లో లెక్కలు చూపుతూ ఆర్యవైశ్య సమాజాన్ని మోసం చేస్తున్నట్లు విమర్శలు లేకపోలేదు. ఇప్పటికైనా ఆర్యవైశ్య పెద్దలు వైశ్య సంఘానికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో వెల్లడించాలని, వాటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని కొంతమంది పేద వైశ్యులకైనా ఉపయోగపడితే చాలనేది కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.