Wyra: సైబర్ పోలీసుల అదుపులో గొల్లపూడి యువకులు.. ఎంతకు తెగించారో తెలుసా?

ఖమ్మం(Khammam) జిల్లా వైరా మండలంలోని గొల్లపూడి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను గురువారం ఉదయం రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Update: 2024-11-21 06:09 GMT

దిశ, వైరా: ఖమ్మం(Khammam) జిల్లా వైరా మండలంలోని గొల్లపూడి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను గురువారం ఉదయం రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిని హైదరాబాద్‌కు తరలించినట్లు తెలిసింది. గొల్లపూడి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గ్రామంలోనే ఉంటూ సాఫ్ట్‌వేర్ కంపెనీ(Software Company)లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నామని గ్రామస్తులకు చెప్పుకున్నారు. అయితే గత మూడు నెలల క్రితం వీరి కోసం మహారాష్ట్ర పోలీసులు గొల్లపూడి గ్రామానికి వచ్చినట్లు తెలిసింది. ఆ సమయంలో వీరిలో ఒక యువకుడి ఆచూకీ మహారాష్ట్ర పోలీసులకు లభించలేదు. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో యువకుడిని మహారాష్ట్ర పోలీసులు అదుపులో తీసుకొని విచారించి అనంతరం వదిలివేశారు.

ఆ తర్వాత మహారాష్ట్ర పోలీసులకు ఆచూకీ లభించని మొదటి యువకుడిని వైరా పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చి మహారాష్ట్ర పోలీసులతో వీడియో కాల్‌లో విచారణ చేయించారు. మూడు నెలలు గడిచిన తర్వాత ఈ వ్యవహారంపై మరోసారి రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించటం చర్చనీయాంశమైంది. అయితే ఆ యువకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ ప్లాట్ ఫామ్ అయిన చాట్ జీపీటీ టూల్‌లోని డేటాను ఇతర దేశాల వారికి ఇతర రాష్ట్రాల వారికి ఆన్లైన్లో విక్రయించారనే ప్రచారం జరుగుతోంది. అయితే వీరు విక్రయించిన డేటా ఏమిటనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఆ డేటాను ఇతర దేశాలు ఇతర రాష్ట్రాల వారు పూర్తిస్థాయిలో మిస్ యూజ్ చేసి సైబర్ నేరాలకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది.

మూడు నెలల క్రితం మహారాష్ట్ర పోలీసులు గొల్లపూడికి వచ్చిన సమయంలో ఒక యువకుడి ఖాతాలో రూ.70 లక్షలు ఉన్నట్లు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ నగదుకు సంబంధించి ఇన్కమ్ టాక్స్, ఆ యువకుడు చేస్తున్న ఆన్లైన్ వ్యాపారానికి సంబంధించిన జీఎస్టీ నెంబర్ గురించి పోలీసులు విచారించారు. ఎలాంటి ఇన్కమ్ టాక్స్ చెల్లించకుండా జీఎస్టీ లేకుండా ఈ నగదు ఆ యువకుడు ఖాతాలో ఉన్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. అసలు ఆ యువకుడు ఖాతాలోకి అంత నగదు ఎలా వచ్చాయని విషయమై పోలీసులు కూడా విచారణ నిర్వహిస్తున్నారు. మూడు నెలల తర్వాత మహారాష్ట్ర పోలీసులు మరోసారి రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించారు. ఆ యువకులను పూర్తిస్థాయిలో విచారించాలని రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులకు మహారాష్ట్ర పోలీసులు సూచించారు.

దీంతో గురువారం ఉదయం వైరా పోలీసులు గొల్లపూడి గ్రామానికి వెళ్లి ఇద్దరి యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అనంతరం వైరా పోలీస్ స్టేషన్ నుంచి ఆ యువకులను రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్ తరలించినట్లు సమాచారం. ముందుగా గొల్లపూడి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఈ డేటా విక్రయాలను ప్రారంభించి భవిష్యత్తులో తనపై కేసులు అవుతాయని భయపడి ఆ విక్రియాలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ యువకుడి వద్ద అక్రమంగా డేటా విక్రయాలు చేసే పనిని నేర్చుకున్న సుమారు 12 మంది తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని గ్రామంలో ప్రచారం జరుగుతుంది.

Tags:    

Similar News