'దిశ' ఎఫెక్ట్.. తోగ్గూడెం క్వారీ సీజ్ !

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తోగ్గూడెం క్వారీలపై జిల్లా అధికారులు కొరడా ఝులిపించారు. ‘దిశ’ దిన పత్రిక మెయిన్ లో వరుస కథనాలు రావడంతో అనివార్యంగా చర్యలు తీసుకోవాల్సివచ్చింది.

Update: 2024-11-21 04:36 GMT

దిశ బ్యూరో, ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తోగ్గూడెం క్వారీలపై జిల్లా అధికారులు కొరడా ఝులిపించారు. ‘దిశ’ దిన పత్రిక మెయిన్ లో వరుస కథనాలు రావడంతో అనివార్యంగా చర్యలు తీసుకోవాల్సివచ్చింది. ఇంతకాలం మైనింగ్ నిర్వాహకులతో అంటకాగిన వివిధ శాఖల ఆఫీసర్స్.. ఎట్టకేలకు తోగ్గూడెం క్వారీని మూయించి, లారీలు వెళ్లకుండా రోడ్ల పై గుంతలు తీశారు. నిబంధనలు ఉల్లంఘించి మైనింగ్ చేస్తున్న తీరును గమనించి నోటీసులు అందజేసినట్లు సమాచారం. అయితే ఈ విషయమంతా రహస్యంగానే జరగడం, బయటి ప్రపంచానికి తెలియకపోవడం విశేషం. చివరకు అధికారులు సందర్శించారన్న సమాచారం ‘దిశ’కే రావడంతో గురువారం ఉదయం తోగ్గూడెం ప్రాంతాన్ని పరిశీలించగా కంకర లోడ్ తో వెళ్లే లారీలు వెళ్లకుండా రోడ్ల పై అడ్డంగా గుంతలు తీయడం కనిపించింది. దాన్ని ఫోటోలు తీసే క్రమంలో అక్కడే చెట్లల్లో ఉన్న కొందరు వ్యక్తులు బెదిరించే ప్రయత్నం చేయడం గమనార్హం. కాగా అధికారులు చర్యలు తీసుకుని క్వారీలను నిలుపుదల చేశారని, నోటీసులు జారీ చేసినట్లు సమాచారం ఉందని స్థానికులు తెలిపి, దిశ పత్రికకు అభినందనలు తెలియజేశారు.

అక్రమ సామ్రాజ్యానికి అడ్డుకట్ట..

ఒక్క క్వారీకి అనుమతులు తీసుకుని మరో తొమ్మిది క్వారీలను అనుమతులు లేకుండా నడుపుతున్నారని ప్రభుత్వ, ఫారెస్ట్ భూముల్లో విచ్చలవిడిగా తవ్వకాలు చేస్తూ కోట్లు గడిస్తున్నారని వారం రోజులుగా దిశ పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని కూడా చెల్లించకుండా దాదాపు 300 కోట్ల మేర బకాయి పడ్డట్లు, అది చెల్లించకుండా కోర్టు కు వెళ్లినట్లు దిశ ప్రచురితం చేసింది. స్థానిక నాయకులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు సైతం క్వారీకి వెళ్లాలంటే భయపడే విధంగా ఓ ప్రైవేట్ సామ్రాజ్యమే కాపలాగా క్వారీకి కాపలా ఉండి పహారా కొనసాగించేది. నిర్వాహకులు సైతం భారీగా ముడుపులు ముట్టజెప్పి అధికారులు, నాయకులను మచ్చిక చేసుకున్నాఅక్రమాలు బయటకు రావడం.. దిశలో వరుస కథనాలు ప్రచురితం కావడం.. రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు ఈ తతంగంపై విచారణ చేసి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో చర్యలు తీసుకోవడం అనివార్యంగా మారింది.

అయినా బెదరని దిశ..

వామ్మె తోగ్గూడెం.. అటు వెళ్లాలంటే జంకుతున్న అధికారులు, జర్నలిస్టులు అంటూ మొదట కథనం ప్రచురితం కాగానే.. క్వారీ నిర్వాహకుడు స్థానిక విలేకరికి ఫోన్ చేసి నానా దుర్భాషలాడాడు. క్వారీలోకి అడుగుపెట్టాలంటే విలేకరులు బెదిరి చస్తారని, ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని, లేదంటే క్వారీలో బొంద పెడతామని హెచ్చరించడం విశేషం. నీ పైనున్నోనికి కూడా చెప్పాలంటూ హూంకరించాడు. సంవత్సరం మొత్తం రాసుకున్నా.. ఎవరూ ఏమీ పీకలేరని, ప్రతినెల అధికారులకు మామూళ్ల పడేస్తున్నామని చెప్పుకొచ్చాడు. స్థానిక రాజకీయ నాయకులు కూడా అండగా ఉన్నారని క్వారీ వైపు కన్నెత్తి చూసే అధికారే లేడని బెదిరించాడు. అయినా ప్రజల పక్షనా నిలిచిన దిశ.. బెదిరింపులకు వెరవకుండా వరుస కథనాలు ప్రచురించడం.. వాటిని రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారుల పంపిచడంతో జిల్లా అధికారుల్లో చలనం కలిగి చర్యలు తీసుకున్నారు. ఇంత జరిగినా అధికారులు తొగ్గూడెం క్వారీ పై చర్యలు తీసుకున్నా రహస్యంగానే ఉంచారు. పూర్తి వివరాల కోసం మైనింగ్ శాఖ ఏడీకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయకపోవడం విశేషం.


Similar News