వైరాలో అన్నీ అక్రమ నిర్మాణాలే..! కనీస అనుమతులు నిల్

వైరా మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా, మున్సిపాలిటీ చట్టానికి వ్యతిరేకంగా అంతా అక్రమ నిర్మాణాలే కొనసాగుతున్నాయి.

Update: 2024-10-24 02:31 GMT

దిశ, వైరా: వైరా మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా, మున్సిపాలిటీ చట్టానికి వ్యతిరేకంగా అంతా అక్రమ నిర్మాణాలే కొనసాగుతున్నాయి. అక్రమ నిర్మాణాల్లో వైరా మున్సిపాలిటీ అగ్రస్థానంలో నిలుస్తుందనటంతో ఎలాంటి సందేహం లేదు. వైరాకు నడిబొడ్డున చేపట్టిన ఈ అక్రమ నిర్మాణాల గురించి కనీసం పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ అక్రమ నిర్మాణాలన్నీ వ్యాపార సముదాయాల కోసం చేపట్టడం విశేషం. తమ వ్యాపార కార్యకలాపాల కోసం మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా భారీ స్థాయిలో రేకుల షెడ్లను నిర్మించారు.

అంతేకాకుండా కొంతమంది రెసిడెన్షియల్ అనుమతులు పొంది కమర్షియల్ కాంప్లెక్స్‌లను నిర్మిస్తున్నారు. వైరాలోని జాతీయ ప్రధాన రహదారికి ఇరువైపులా ఈ నిర్మాణాలు కొనసాగుతున్నా మున్సిపాలిటీ అధికారులకు కనిపించకపోవడం దారుణం. ఇటీవల వైరా మున్సిపాలిటీ 10వ వార్డ్ కౌన్సిలర్ కర్నాటి నందిని, హనుమంతరావు దంపతులతో పాటు పలువురు వైరాలో అక్రమ నిర్మాణాలపై ఆందోళన చేసి అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. అయినా ఇదంతా తమకు ‘మామూలే’ అని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇంత బహిరంగంగా కనీస అనుమతులు లేకుండా చేపడుతున్నా, చేపట్టిన నిర్మాణాల పట్ల అధికారులు ఉదాసీనంగా వ్యవహరించటంతో మున్సిపాలిటీ ఆదాయానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది.

అక్రమ నిర్మాణాలు ఇవే!

వైరాలోని జాతీయ ప్రధాని రహదారి పక్కన మొదలుకుని పలు వార్డుల్లో అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. గత సంవత్సర కాలం క్రితం వైరా బస్టాండ్ వెనుక భాగంలో ఎలాంటి అనుమతులు లేకుండా మూడంతస్తుల భవనాన్ని నిర్మించారు. అయితే గత రెండు రోజుల క్రితం అనుమతులు లేకుండా నిర్మించిన ఈ భవనాన్ని తొలగించాలని 10వ వార్డు కౌన్సిలర్ కర్నాటి నందిని, హనుమంత రావు దంపతులతో పాటు కొంతమంది ఆందోళన చేశారు. మున్సిపాలిటీ కమిషనర్‌కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.

అదేవిధంగా వైరా లోని పాత బస్టాండ్ సెంటర్లో వజ్రా టీవీఎస్ షోరూం ఏర్పాటు చేసేందుకు మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా భారీ స్థాయిలో రేకుల షెడ్డు నిర్మించారు. అంతే కాకుండా వైరా నడిబొడ్డున మధిర క్రాస్ రోడ్డు సమీపంలో టీ టైమ్స్ టీ స్టాల్ ఏర్పాటు చేసేందుకు సుమారు 350 గజాల్లో భారీ స్థాయి రేకుల షెడ్డు నిర్మించారు. ఈ నిర్మాణానికి కనీస అనుమతులు తీసుకోలేదు. ఇక వైరా తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా ఓ భవనాన్ని కమర్షియల్ కేంద్రంగా మార్చారు.

సుమారు 100 గజాల లోపు ఉన్న ఈ స్థలంలో మూడంతస్తుల నిర్మించి షెట్టర్లు నిర్మించారు. కనీసం ఈ భవనానికి పార్కింగ్ స్థలం కూడా లేనప్పటికీ అధికారులు ఈ అక్రమ నిర్మాణాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. అంతే కాకుండా ఇటీవల తల్లాడ రోడ్డులో ఎలాంటి అనుమతి లేకుండా నిర్మించిన భారీ స్థాయి రేకుల షెడ్డులో వెంకటేశ్వర టైల్స్ మార్బుల్ అండ్ గ్రానైట్ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. ఈ రేకుల షెడ్డు నిర్మాణంపై పలు ఫిర్యాదుల అందినా అధికారులు కనీసం పట్టించుకోవటం లేదు. అక్రమ నిర్మాణాలతో వైరా మున్సిపాలిటీ నష్టపోతున్నా అధికారుల్లో కనీస చలనం లేదు.

దర్జాగా ఇంటి నెంబర్లు..

వైరా మున్సిపాలిటీలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలకు దర్జాగా ఇంటి నెంబర్లను కేటాయించడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఇటీవల గండగలపాడులో ఖాళీ స్థలానికి అధికారులు ఇంటి నెంబర్ కేటాయించారు. అయితే, అధికారులు కేటాయించిన ఇంటి నెంబర్ ఆధారంగా ఇంటి నెంబర్ పొందిన వ్యక్తి తన స్థలంతో పాటు తన పక్కనే ఉన్న మరో 330 గజాల స్థలాన్ని కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ విషయమై గండగలపాడు గ్రామంలో పంచాయతీలు జరిగాయి.

అదేవిధంగా వైరా మున్సిపాలిటీలోని అక్రమంగా చేపట్టిన నిర్మాణాలకు ఇంటి నెంబర్లు కేటాయించేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. డబుల్ టాక్స్ పేరుతో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలకు ఇంటి నెంబర్లు కేటాయిస్తున్నారు. ఇప్పటికే వైరా మున్సిపాలిటీలో ఇంటి నెంబర్లు కేటాయింపులో అనేక అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా ఇంటి నెంబర్లు కేటాయించటం వివాదాస్పదం అవుతోంది. ఇప్పటికైనా సంబంధిత శాఖ జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వైరా మున్సిపాలిటీలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


Similar News