పాలేరులో త్రిముఖ పోటీయా.. ద్విముఖ పోరా!

రాష్ట్ర నియోజకవర్గాల్లో పాలేరు నియోజకవర్గ ప్రత్యేకత వేరు. జనరల్ స్థానంగా ఉన్న నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది.

Update: 2023-02-14 12:10 GMT

కమ్యూనిస్టుల ఓటు బ్యాంకే కీలకమా..

దిశ కూసుమంచి: రాష్ట్ర నియోజకవర్గాల్లో పాలేరు నియోజకవర్గ ప్రత్యేకత వేరు. జనరల్ స్థానంగా ఉన్న నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో దాదాపు 11సార్లు అక్కడ కాంగ్రెస్ జెండానే ఎగరవేసింది. 1962లో ఖమ్మం నియోజకవర్గం నుంచి విడిపోయిన పాలేరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14సార్లు సాధారణ ఎన్నికలు జరిగాయి. 2016లో జరిగిన ఉప ఎన్నికల్లో మొదటి సారి టీఆర్ఎస్ విజయం సాధించింది. అప్పటి వరకు వరసగా రెండు సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించి మంత్రిగా పనిచేసిన రాంరెడ్డి వెంకట్ రెడ్డి అకాల మరణంతో పాలేరులో ఉప ఎన్నిక అనివార్యమైంది.

    ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా స్వర్గీయ రాంరెడ్డి వెంకట్ రెడ్డి సతీమణి సుచరిత రెడ్డి బరిలో నిలువగా అప్పటికే టీఆర్ఎస్ పక్షాన శాసన మండలి సభ్యుడిగా, మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరావు బరిలో నిలిచి అత్యధిక మెజారిటీతో విజయం సాధించాడు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిగా ఉన్న తుమ్మల బరిలో ఉండగా తొలిసారి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన కందాళ ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చి నాటి మంత్రి తుమ్మల నాగేశ్వరావుపై 7,669వేల ఓట్ల మెజారిటీతో ఉపేందర్ రెడ్డి విజయం సాధించాడు. అప్పట్లో తుమ్మల నాగేశ్వరరావు ఓటమి ఒక సంచలనం.

పాలేరులో నాదే విజయం అంటున్న కందాళ

పాలేరు సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కూసుమంచి మండలంలోని రాజపేట గ్రామానికి చెందిన వ్యక్తిగా లోకల్ రాజకీయ నాయకుడిగా, ప్రజలందరికీ సుపరిచితమైన వ్యక్తి. తాను తొలి ప్రయత్నంలోనే రాజకీయ చాణక్యుడైన మాజీ మంత్రి తుమ్మలపై విజయం సాధించి నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నాడు. నియోజకవర్గంలోని నిరుపేదలకు తన సొంత డబ్బులతో ప్రతి గ్రామంలో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లున్నాడు.

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను నిత్యం ప్రజల్లోకి తీసుకెళ్తూ, తన సొంత నిధులతో ప్రతి గ్రామంలో మందిరాలు, మసీదులు చర్చిల నిర్మాణాలు, వికలాంగులు, చదువులో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న పేద విద్యార్థినీ విద్యార్థులకు అండగా ఉంటూ ఆర్ధిక సాయం చేస్తున్నాడు. నియోజకవర్గంలో కుల, మత వర్గ విబేధాలు లేకుండా వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాలకు మనోధైర్యాన్ని కలిపిస్తూ ఒక్కోక్క కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సాయం అందిస్తూ ప్రజల్లో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పాలేరు నియోజకవర్గ అభ్యర్థిగా తనే బరిలో ఉంటానని ప్రజలు ఆశీర్వదించి మరోసారి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

పాలేరులో తుమ్మల పోటీకి సిద్దమని ప్రచారం

ఖమ్మం జిల్లాలో పరిచయం అక్కర్లేని వ్యక్తి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 2018 ఎన్నికల్లో ఓటమి అనంతరం కొంత మౌనంగా ఆయన గత నెలలో బీఆర్ఎస్ బహిరంగ సభతో అటు పార్టీకి.. ఇటు ప్రజలకు దగ్గరవుతున్నాడు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అనే చందంగా మరోసారి పాలేరు నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్న నేపథ్యంలో, ఇటీవల కాలంలో నియోజకవర్గంలోని బారుగూడెం లో గల శ్రీ సిటీలో తన గృహప్రవేశం నేపథ్యంలో ఆత్మీయ సమ్మేళనం పేరుతో వేలాది మంది కార్యకర్తలను సమీకరించి విందు ఏర్పాటు చేశాడు. ఇటు పాలేరు ప్రజానీకానికి తన సత్తా చాటే ప్రయత్నం చేశాడు. నియోజకవర్గంలోని తన అనుచరుల శుభకార్యాలకు వరుసగా హాజరవుతూ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. సోషల్ మీడియా వేదికగా తుమ్మల పాలేరు నుంచే పోటీ చేయబోతున్నారని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. తుమ్మల కూడా బీఆర్ఎస్ నుంచి టికెట్ వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఇక పాలేరు బరిలో ఇటు తుమ్మల, అటు కందాళ ఎవరూ పోటీ చేస్తారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

పాలేరు మట్టితో షర్మిల శపథం

రాష్టంలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఊహాగానం నేపథ్యంలో పాలేరు నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వై.ఎస్ షర్మిల పోటీకి సన్నమద్ధమవుతున్నారు. ఇప్పటికే తన అనుచరులు ప్రజలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం నాయకులదే ఆధిపత్యం ఉండటంతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మద్దతు సైతం ఉందంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది. పాలేరులో దళిత, గిరిజన ఓటర్లు అత్యధికంగా కాంగ్రెస్ పక్షాన ఉన్నందున, తన తండ్రి వై.యస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దృష్టిలో పెట్టుకొని అక్కడ విజయం సాధించవచ్చని ధీమాతో ఉంది. ఇటీవలే ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరిలో తమ పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో మట్టి చేత పట్టి పాలేరు ప్రజల బిడ్డగా ఇక్కడ నుండే పోటీ చేస్తానని స్వయంగా ప్రకటించింది.

సరైన నాయకుడి కోసం కాంగ్రెస్ ఎదురుచూపులు

పాలేరు నియోజకవర్గం కంచుకోటగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సరైన నాయకుడు లేక ఉనికి కోల్పోతోంది. పార్టీ అభివృద్ధికి కట్టుబడి ఉన్న నాయకుడు ఉంటేనే కాంగ్రెస్ కు పూర్వవైభం వస్తుందని నాయకులు, కార్యకర్తల అభిమతం. లేనిపక్షంలో సుదీర్ఘ కాలం పాటు గెలుపును తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితం అవుతుందని చెప్పక తప్పడం లేదు. ఇక పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ఇంకా పాలేరు నియోజకవర్గంలో సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా, బీజేపీ, బీఎస్పీ, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ, టీడీపీ పార్టీలు, స్వతంత్రులు పోటీ చేసిన డిపాజిట్ కూడా దక్కించుకోలేని పరిస్థితులు కనబడుతున్నాయి.

కమ్యూనిస్టుల ఓటు బ్యాంకే కీలకం కానుందా?

పాలేరు నియోజకవర్గం లో ఉన్న వామపక్ష పార్టీలు అయిన సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసి, సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా పార్టీలు తమ ఓటు బ్యాంకును మద్దతు ఇచ్చే వారికే గెలుపు ఖాయం అన్నది స్పష్టం అవుతోంది. అందుకు మునుగోడులో జరిగిన ఉప ఎన్నిక పాలేరుకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.

Tags:    

Similar News