పదవుల కోసం తుమ్మల పాకులాడే వ్యక్తి
నిన్న పాలేరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమై సీఎం కేసీఆర్ కు మంచి ఆదరణ లభించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు.
దిశ, ఖమ్మం సిటీ : నిన్న పాలేరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమై సీఎం కేసీఆర్ కు మంచి ఆదరణ లభించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన సంస్కరణల వల్లే ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదికి పది స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడిన విషయాలపై మాజీ మంత్రి తుమ్మల విమర్శలు గుప్పించడం తగదు అన్నారు. తుమ్మల 40 ఏళ్ల రాజకీయాల్లో ఖమ్మం కు చేసింది ఏమీ లేదని, ఏ పదవిలేని తుమ్మలను పిలిచి కేసీఆర్ పదవులు ఇస్తే ఈరోజు ఆయన్ని విమర్శించే స్థాయికి రావటం సరికాదు అన్నారు. టీడీపీలో కేసీఆర్ కు మంత్రి పదవి ఇప్పించానన్న తుమ్మల వ్యాఖ్యలు అర్థరహితమని, చరిత్రను తెలుసుకొని మాట్లాడాలని హెచ్చరించారు. మంత్రి కాకముందు నీ ఆస్తులు ఎన్ని మంత్రి అయ్యాక నీ ఆస్తులు ఎన్నో చెప్పాలి అని డిమాండ్ చేశారు.
గతంలో మంత్రిగా పనిచేసిన తుమ్మలకు సీతారామప్రాజెక్ట్ నిర్మాణం ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. తుమ్మల అహంకారం ప్రజలందరికీ తెలుసు అన్నారు. ఎమ్మెల్యేగా తాను ఈ ఐదు సంవత్సరాల్లో ఏమి కాంట్రాక్టులు చేశానో తుమ్మల నిరూపించాలని సవాల్ విసిరారు. ఎంతోకాలంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది అని చెప్పుకుంటూ ప్రజల పట్ల అహంకారాన్ని చూపించడం మీకే చెల్లుతుందన్నారు. ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారని, రానున్న రోజుల్లో ఇలాంటి వ్యక్తులకు రాజకీయంగా తగిన బుద్ధి చెప్తారని ఆశిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. వచ్చేనెల ఐదున ఖమ్మం నియోజకవర్గం లో ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ రానున్నట్లు తెలిపారు. ఆ సభకు వేలాదిగా నగరం నుండి ప్రజలు తరలి రావాలని వారు కోరారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. పొంగులేటి, తుమ్మల ఇద్దరు కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీలో చేరి పార్టీని నాశనం చేయాలని చూశారన్నారు. కేసీఆర్ ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీకి వెన్ను పోటు పొడిచింది మీరు ఇద్దరు కాదా అన్నారు. పాలేరు సీటు కావాలి అని పోరాడి,
పోటీ చేస్తా అని చెప్పి దాన్ని వదిలి ఇప్పుడు ఎక్కడ పోటీ చేస్తున్నావు.. ఖమ్మం కు పోటీ చేస్తున్నావు ఇది నీ స్వార్థం కాదా అన్నారు. ప్రజలపై అభిమానం ఉన్నోడిలా మాట్లాడుతుంటే నవ్వొస్తుందన్నారు. ఎంపీ నామా నాగేశ్వర రావు మాట్లాడుతూ కేసీఆర్ అన్న మాటలు 100 కు 100 శాతం కరెక్ట్ అని తెలంగాణ బిల్లు పెటినప్పుడు మొదటి ఓటు వేసిన వ్యక్తిని నేనే అన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, నిబద్ధత వల్ల ఎంపీగా అఖండ మెజారిటీ సాధించా అని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ ఈ జిల్లాలో పదవులు అనుభవించి వేరే పార్టీలోకి చేరి ఈ రోజు దయ్యాలు వేదాలు వళ్లించినట్టు ఉంది అన్నారు. మా పార్టీ అభ్యర్థులను దగ్గరుండి ఓడించినది మీరు కాదా అన్నారు.
నిన్ను ఓడించింది పొంగులేటి అని నువ్వే స్వయంగా చెప్పి ఇప్పుడు ఇద్దరూ కలిసి చెట్టాపట్టలు వేసుకుని తిరుగుతున్నారని, దీనిని జనాలు చూసి నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ మనం ప్రజలకు ఆదర్శంగా ఉండాలని హితవు పలికారు. తాను 2014 తరువాత ఏదైనా కాంట్రాక్ట్ తీసుకున్నట్టు నిరూపిస్తే ఎన్నికల నుండి తప్పుకుంటా అన్నారు. సమావేశంలో మధిర అభ్యర్థి లింగాల కమల్ రాజు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, కొండబాల కోటేశ్వరరావు, ఆర్జేసీ కృష్ణ పాల్గొన్నారు.