దుమ్ముగూడెంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్
భద్రాచలం నియోజకవర్గ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది.

దిశ,దుమ్ముగూడెం : భద్రాచలం నియోజకవర్గ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. దుమ్ముగూడెం మండలంలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. పార్టీ మాజీ మండల అధ్యక్షుడు ,మాజీ జడ్పీటీసీ అన్నే సత్యనారాయణ మూర్తి (సత్యాలు) తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ కు గుడ్‌బై చెప్పి, కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇది స్థానిక రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. భద్రాచలం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం రాత్రి చేరిక జరుగగా.. సోమవారం మధ్యాహ్నం అధికారికంగా తెలిసింది.ఈ చేరిక తెలంగాణ రెవిన్యూ , గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒక్క సత్యాలు మాత్రమే కాదు, మొత్తం 50 కుటుంబాలు కాంగ్రెస్ గూటికి చేరడం బీఆర్ఎస్ కి ఊహించని ఎదురు దెబ్బగా మారింది.
గత కొంతకాలంగా ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుండగా, ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావుతో సన్నిహితంగా ఉండటంతో, తన పార్టీ మార్పు నిశ్చితమని ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు మాత్రం ఆయన తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరడం అధికారికంగా మారింది. ఈ సందర్భంగా సత్యాలు మాట్లాడుతూ..ప్రజలకు సేవ చేయడమే నా ధ్యేయం. భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు నాయకత్వంపై నాకు విశ్వాసం ఉందన్నారు. ఆయన ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడుతుండటంతో.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.ఈ చేరిక కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, భద్రాచలం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తెల్లం సీతమ్మ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు లంక శ్రీనివాసరావు (అబ్బులు), డివిజన్ సేవాదళ్ అధ్యక్షులు పిలక వెంకటరమణ రెడ్డి, మాజీ సర్పంచ్ మట్ట వెంకటేశ్వరావు (శివాజీ), సీనియర్ నాయకులు కుంజా శ్రీనివాసరావు, కెల్లా శేఖర్, తోట రమేష్, సేవాదళ్ మండల అధ్యక్షులు కొమ్ము రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.