ఖమ్మంను ఎంతో అభివృద్ధి చేశా : Minister Puvvada Ajay Kumar
నాలుగేళ్లలో ఖమ్మం స్వరూపం పూర్తిగా మారిపోయిందని, ఇదంతా ఒక్కరోజులోనే జరగలేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
దిశ బ్యూరో, ఖమ్మం: నాలుగేళ్లలో ఖమ్మం స్వరూపం పూర్తిగా మారిపోయిందని, ఇదంతా ఒక్కరోజులోనే జరగలేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరం 12వ డివిజన్ నందు పులిపాటి ప్రసాద్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పువ్వాడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడచిన నాలుగేళ్లలో ఖమ్మం స్వరూపం పూర్తిగా మారిపోయిందని, ఇతర ప్రదేశాలకు వెళ్లి తిరిగి ఖమ్మం వచ్చిన వారు ఆశ్చర్యాన్ని వ్యక్త పరచటం సంతోషాన్నిచ్చిందన్నారు. ఇదంతా ఒక్క రోజులో సాధ్యం కాలేదని, ప్రణాళికా బద్ధంగా పని చేయడం ద్వారానే సాధ్యమైందని వెల్లడించారు.
మంత్రి కేటీఆర్‌కు నా ఆలోచనలు చెప్పినపుడు నువు ముందుకు వెళ్ళు.. నిధుల సంగతి నేను చూసుకుంటా అని హామీ ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మం జిల్లా కేంద్ర బస్ స్టాండ్ గతంలో ఒక కాంట్రాక్టర్‌కి ఇస్తే తీవ్ర జాప్యం చేశారని, తానే స్వయంగా కల్పించుకుని మరొకరికి ఇచ్చి ఆ నిర్మాణం కేవలం 9 నెలల్లో పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసినామని చెప్పారు. ఒకప్పుడు గోళ్ళపాడు ఖమ్మం త్రీ టౌన్‌కు శాపంగా ఉండేదని, ఎమ్మెల్యేగా గెలిచిన తొలి సంవత్సరమే తన పుట్టినరోజు సందర్భంగా గోళ్ళపాడు ఛానల్‌ను స్వయంగా అభివృద్ది పనులు ప్రారంభించానని చెప్పారు. ఎన్నికలు రాగానే వస్తున్న వివిధ పార్టీల నాయకులు నేడు ప్రజలపై దొంగ ప్రేమలు కురిపిస్తున్నారని, ఆ నాడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
విస్తృత స్థాయి సమావేశంలో...
ఖమ్మం నియోజకవర్గ స్థాయి బూత్ లెవెల్ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై పువ్వాడ మాట్లాడుతూ.. నవంబర్ 5న ఖమ్మం నియోజకవర్గ స్థాయి కేసీఆర్ సభ, 10వ తేదీన తన నామినేషన్, ప్రచారం చివరి రోజుల్లో కేటీఆర్ రోడ్ షో ఉంటుందని తెలిపారు. శ్రేణులందరూ కదన రంగంలోకి దిగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో గడప గడపకు ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు.