పెనం మీద నుండి పొయ్యిలోకి.. అవతరణ దినోత్సవ వేళ.. బండి సంజయ్ కీలక సందేశం
బీఆర్ఎస్ పాలనలో తమ బతుకులు పెనం మీద ఉంటే.. కాంగ్రెస్ పాలనలో పొయ్యిలో జారిపడ్డట్లయిందని ముక్తకంఠంతో ప్రజలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పేర్కొన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పాలనలో తమ బతుకులు పెనం మీద ఉంటే.. కాంగ్రెస్ పాలనలో పొయ్యిలో జారిపడ్డట్లయిందని ముక్తకంఠంతో ప్రజలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల వేళ రాష్ట్ర ప్రజలందరికీ ఇవాళ ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంట్ లోపల, బయట రాష్ట్ర సాధనలో బీజేపీ పాత్ర అత్యంత కీలక పాత్ర పోషించిందన్నారు. నాటి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలోని బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిస్తూ తీర్మానం చేస్తే.. పార్లమెంట్ లో బిల్లును అడ్డుకునేందుకు కొందరు ఎంపీలు పెప్పర్ స్ప్రే చల్లి గొడవకు దిగితే.. వాటిని సహిస్తూ నిలబడి బిల్లును ఆమోదించిన మహానేత సుష్మస్వరాజ్‌ను నేడు మనమంతా స్మరించకుండా ఉండలేమని గుర్తుచేశారు.
ఉద్యమ ఆకాంక్షలు అమలు కాలేదు
బాధాకరమైన విషయం ఏందంటే.. పదేళ్లయినా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు అమలు కాలేదన్నారు. గతంలో తెలంగాణకు దక్కాల్సిన నీళ్లను పరాయి పాలకులు పక్క రాష్ట్రానికి దోచిపెడితే.. స్వరాష్ట్రం సిద్ధించిన తెలంగాణ పాలకులే స్వార్థ ప్రయోజనాల కోసం పొరుగు రాష్ట్రానికి నీటిని తాకట్టు పెట్టారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలకులను గద్దెదించి పదేళ్ల పాలన పీడ విరగడైందని సంతోషిద్దామంటే.. అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ సైతం బీఆర్ఎస్ బాటలోనే నడుస్తోందన్నారు. 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే 6 గ్యారంటీలు సహా ఎన్నికల హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. కన్పించిన ప్రతి దాంట్లో కమీషన్లు దండుకోవడమే పనిగా పెట్టుకుందన్నారు. తెలంగాణను కాంగ్రెస్ పెద్దలకు ఏటీఎంగా మారుస్తూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని ఆరోపణలు చేశారు.
మహా పోరాటానికి సిద్దం
కాంగ్రెస్ పాలకులు బీఆర్ఎస్ మాదిరిగానే పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో ‘తెలంగాణ పదేండ్ల పండుగ’ పేరుతో ప్రకటనలిస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ విచిత్ర పోకడలను అనుసరిస్తున్నారు. అందుకే ప్రజల పక్షాన, అమరుల ఆశయాల కోసం, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం బీజేపీ మరో ఉద్యమానికి సిద్ధమైందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదల పక్షాన బీజేపీ అలుపెరగని పోరాటాలకు సన్నద్దమైందని, ఈ పోరాటంలో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు అండగా నిలవాలని, తెలంగాణ ఉద్యమకారులంతా మద్దతివ్వాలని, అమరుల కుటుంబాలు ఆశీర్వదించాలని కోరారు. ఈ మహా పోరాటంలో తెలంగాణ బిడ్డలంతా బీజేపీకి సంపూర్ణ మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు.