చేరికల సమయంలో ‘బీ కేర్‌ఫుల్’.. పీసీసీకి ఏఐసీసీ నుంచి కీలక సూచనలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలతో పార్టీలో అసంతృప్తులు, అలకలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పీసీసీకి ఢిల్లీ పెద్దలు సూచించినట్లు తెలిసింది.

Update: 2024-06-25 02:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలతో పార్టీలో అసంతృప్తులు, అలకలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పీసీసీకి ఢిల్లీ పెద్దలు సూచించినట్లు తెలిసింది. విభేదాలు తలెత్తకుండా, పార్టీ బలోపేతం కోసం సమన్వయంతో పనిచేయాలని క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేల వల్ల కాంగ్రెస్ లీడర్లకు ప్రయారిటీ తగ్గొద్దని, సరైన గుర్తింపు ఉండాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ మధ్య గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో స్థానిక లీడర్ల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్న విషయాన్ని గ్రహించిన ఏఐసీసీ సమస్యకు పరిష్కారం చూపినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పోస్టులు

రెండు రోజుల తేడాతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే చేరికలతో ఆ నియోజకవర్గాల్లోని ఇన్ చార్జిలుగా ఉన్న లీడర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమను సంప్రదించకుండా చేరికలను ఏమిటని అలక వహిస్తున్నారు. ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన తమను పక్కన పెట్టి వలస లీడర్లకు ప్రయారిటీ ఇవ్వడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన అధిష్టానం త్వరలో ఖాళీ కానున్న అసెంబ్లీ కోటా లేకపోతే లోకల్ బాడీ కోటాల్లో ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఒకవేళ సాధ్యం కాకపోతే రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని సీఎం రేవంత్ కు సూచించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. భవిష్యత్తులో మరికొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నట్టు ప్రచారం జోరుగా సాగుతున్నది. ఈ నేపథ్యంలో ఆ చేరికలను వ్యతిరేకించకుండా ఉండేందుకు ముందుగానే ఆ నియోజకవర్గాలకు చెందిన లీడర్లతో మంతనాలు చేయాలని పీసీసీకి హైకమాండ్ సూచించినట్టు తెలిసింది.

డీ లిమిటేషన్ తో టికెట్ల గొడవకు ఫుల్ స్టాప్

రాష్ట్రంలో 2029 అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకే టికెట్ ఇస్తారేమోననే భయం కాంగ్రెస్ లీడర్లకు పట్టుకున్నది. అయితే అలాంటి భయాలు, అనుమానాలు పెట్టుకోవద్దని అధిష్టానం సూచించినట్టు తెలిసింది. 2029 నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగి కొత్త అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలు ఏర్పడనున్నాయి. దీంతో కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు, నియోజకవర్గాల్లో ఇన్ చార్జిలుగా ఉన్న లీడర్లకు సైతం టికెట్లు ఇవ్వొచ్చని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అందుకే వలస నేతలతో గొడవలు లేకుండా, అందరి సమన్వయంతో పనిచేయాలని సూచించినట్టు సమాచారం.

వర్గపోరు ఉండదని ధీమా

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టికెట్ల గొడవే ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారడంతోపాటు ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది. కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు, బీఆర్ఎస్ లీడర్ల మధ్య ఆధిపత్య పోరు నడిచింది. దీంతో చాలా నియోజకవర్గాల్లో ఓపెన్ గానే గోడవలు జరిగాయి. ఆ గొడవలు మెల్లమెల్లగా పెద్దవిగా మారి, అసెంబ్లీ ఎన్నికల నాటికి టికెట్ దక్కని కొందరు లీడర్లు ఆపార్టీ ఓటమికి ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేశారు. కానీ కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గాల పునర్విభజన వల్ల అలాంటి తలనొప్పులు రావని ఆపార్టీ లీడర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

‘హస్తం’లో చేరిన గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కంటెస్టెడ్ లీడర్లు

దానం నాగేందర్ పీ.విజయారెడ్డి

కడియం శ్రీహరి ఇందిరా

తెల్లా వెంకట్రావు పోదెం వీరయ్య

పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏనుగు రవీందర్ రెడ్డి

సంజయ్ కుమార్ జీవన్ రెడ్డి

బీజేపీకి చాన్స్ ఇవ్వొద్దనే చేరికలు స్పీడప్ 

రాష్ట్రంలో ఎనిమిది ఎంపీ స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. పార్టీ బలోపేతం కోసం ఫోకస్ పెడుతున్నది. అందులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు ఢిల్లీ కమలం పెద్దలు సిద్ధమైనట్లు సీఎం రేవంత్ కు సంకేతాలు అందినట్టు టాక్ ఉంది. అందుకే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రేవంత్ స్వయంగా రంగంలోకి దిగారని సమాచారం. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలపై ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. స్వయంగా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడం, వాళ్ల ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు చర్చించుకుంటున్నారు. అందుకే రెండు రోజుల తేడాతో పోచారం, సంజయ్ కాంగ్రెస్ గూటికి వచ్చారని చెప్తున్నారు. త్వరలో మరికొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారని, బడ్జెట్ సమావేశాల నాటికి బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ప్రక్రియ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తున్నది.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మంత్రి శ్రీధర్ బాబు బుజ్జగింపు

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకబూనారు. దీంతో సోమవారం మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విజయ రమణారావుతో కలిసి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. రెండు గంటలకు పైగా చర్చలు జరిపారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన ఊహగానాల నేపథ్యంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని బుజ్జగించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేను చేర్చుకునే విషయంలో జరిగిన మిస్ కమ్యూనికేషన్ ను హై కమాండ్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. జీవన్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పెద్ద దిక్కు అని, కఠిన పరిస్థితుల్లో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఎన్నికల్లో పోటీ చేశారని గుర్తు చేశారు. ఈ విషయంలో సమీక్ష చేస్తామని, జగిత్యాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధైర్యపడవద్దని పేర్కొన్నారు.


Similar News