గిరిజన యూనివర్సిటీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

గిరిజన యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ సెలక్ట్ చేసింది.

Update: 2024-10-19 17:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : గిరిజన యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ సెలక్ట్ చేసింది. ములుగులో 221 ఎకరాలు ఫైనల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఈ నెల 26న జరిగే క్యాబినేట్ లో తీర్మానం చేయనున్నారు. ఆ తర్వాత సదరు భూమి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించనున్నది. దీంతో ఏళ్ల తరబడి పెండింగ్ లోని సమస్యకు చెక్ పడనున్నది. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం గత కొన్నేళ్ల నుంచి స్థలం కేటాయించలేదనే కారణంతో యూనివర్సిటీ ఏర్పాటుకు ఆలస్యమైందని కేంద్రం చెప్తూ వచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క నేతృత్వంలో వివిధ దశల్లో సుదీర్ఘంగా అధ్యయనం తర్వాత స్థలం కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతోనూ ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఈ భూమి కేటాయింపును ఫైనల్ చేశారు. వాస్తవానికి గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు దాదాపు 500 ఎకరాల స్థలం అవసరం అవుతుందని గతంలో కేంద్రం పేర్కొన్నది. అయితే ఒకే చోట అంత అన్ని ఎకరాల భూమి సమకూర్చడం కష్టమని, రెండు చోట్ల కేటాయించడం వీలవుతుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివరించింది. దీనికి చాలా ఏళ్ల తర్వాత అంగీకరించిన కేంద్రం, తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకునేందుకు రెడీ అయింది.

550 మందికి కారుణ్య నియామకాలు...

పంచాయతీ రాజ్​శాఖలోని వివిధ విభాగాల్లో 550 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత కొన్నేళ్ల నుంచి బాధితులు బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకువచ్చినా, పట్టించుకోలేదు. కొందరు మంత్రులు వినతిపత్రాలు తీసుకొని పక్కకు పడేశారని బాధుతులు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పదినెలల్లోనే కారుణ్య నియామకాలపై అధ్యయనం చేసి ఫైనల్ చేయడం సంతోషంగా ఉన్నదని బాధితులు పేర్కొన్నారు. క్యాబినేట్ లో చర్చించిన తర్వాత, పంచాయతీ రాజ్​ శాఖలో ఎంపిక చేసిన 550 మందికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వనున్నది.


Similar News