రేవంత్ సర్కారు కీలక నిర్ణయం.. పోలీసు కొత్వాల్ రేసులో మహిళా IPS ఆఫీసర్..??

హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు మహిళా ఆఫీసర్ పోలీసు కమిషనర్‌గా వస్తున్నారా.. ఈ సారి అవకాశం మహిళలకు దక్కనుందా..

Update: 2024-06-10 07:10 GMT

దిశ, క్రైమ్ బ్యూరో : హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు మహిళా ఆఫీసర్ పోలీసు కమిషనర్‌గా వస్తున్నారా.. ఈ సారి అవకాశం మహిళలకు దక్కనుందా.. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన హైదరాబాద్‌కు ఓ సీనియర్ మహిళా పోలీసు ఆఫీసర్ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి చరిత్ర స్రుష్టించబోతున్నారా.. వారికి ఈ పోస్టు ఇచ్చినా సమర్ధతవంతంగా నిర్వహించే సత్తా ఉన్న మహిళా ఆఫీసర్‌లు డిపార్ట్ మెంట్‌లో ఉన్నారని ఇప్పుడు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా సీనియర్ మహిళా పోలీసు ఆఫీసర్‌ను నియమిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరికొత్త చరిత్ర శ్రీకారం చుట్టినట్లు అవుతుందని పోలీసు వర్గాలు అంటున్నాయి.

అయితే తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాంతి భద్రతల నిర్వహణలో ఏలాంటి రాజీ పడకుండా విధులను నిర్వహించే అధికారులను ఆయన బాధ్యతలను చేపట్టినప్పుడు నిర్ణయం తీసుకుని హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, సైబరాబాద్‌కు అవినాష్ మహంతి, రాచకొండ కు సుధీర్ బాబును నియమించారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్‌తో సుధీర్ బాబు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో తరుణ జోషి రాచకొండ పోలీసు కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యి కోడ్ ముగియడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మార్క్ ఉండేలా పాలనను సాగించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపడతారని కొన్ని రోజులుగా పోలీసు వర్గాలతో పాటు అధికారుల వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు బాసులు కూడా మారే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా మహిళా ఆఫీసర్‌కు దక్కే ఛాన్స్ ఉందనే వాదన ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. ఇప్పుడు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో దాదాపు 8 మంది మహిళ ఆఫీసర్‌లు జోన్ డీసీపీలుగా సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తుండడంతో హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా మహిళా అధికారిని నియమిస్తే శాంత భద్రతల నిర్వహణ పటిష్టంగా నిర్వహించడంతో పాటు ప్రభుత్వం మహిళ రక్షణ పట్ల పూర్తి ప్రాధాన్యతను ఇస్తుందనే సంకేతాలు కూడా ప్రజల్లోకి వెళ్తాయని పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నారు. అలా ప్రభుత్వం నిజంగానే ఆలోచిస్తే 1994, 1995 బ్యాచ్ కు చెందిన ఇద్దరు సీనియర్ మహిళ ఐపీఎస్‌లు రేసులో ఉండే అవకాశం ఉంది. అందులో ఓ మహిళా ఆఫీసర్ ప్రస్తుతం నాలుగు విభాగాలను సింగిల్ హ్యాండ్‌తో అందరిని సమన్వయం చేసుకుంటూ సమర్ధవంతంగా నడిపిస్తున్నారు. మరో మహిళా అధికారి కూడా కీలక పోస్టులో ఇప్పుడు విధులను నిర్వహిస్తున్నారు. 


Similar News