‘‘ఏదో చిన్నలోపం జరిగినట్లుంది’’.. మేడిగడ్డ ఇష్యూపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
‘ఐదేళ్లు పూర్తయింది మేడిగడ్డ ప్రాజెక్టు.. గతేడాది 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకొని నిలబడింది.. ఈసారి ఏదో చిన్న లోపం జరిగినట్లుంది.. ఆ లోపం చిన్నదా? పెద్దదా?
దిశ, తెలంగాణ బ్యూరో: ‘ఐదేళ్లు పూర్తయింది మేడిగడ్డ ప్రాజెక్టు.. గతేడాది 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకొని నిలబడింది.. ఈసారి ఏదో చిన్న లోపం జరిగినట్లుంది.. ఆ లోపం చిన్నదా? పెద్దదా? చెప్పలేం.. కానీ లోపం ఏంటిదనేది నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులు వచ్చి పరిశీలించి రిపోర్టు ఇస్తారు.. లోపం ఏదైనా ఒక్కపైసా ప్రజలపై భారం పడదు.. మొత్తం ఏజెన్సీయే పునరుద్దరిస్తుంది. తెలంగాణ ప్రజలపైనా, ప్రభుత్వంపైనా భారం పడదు’ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని బషీరాబాద్ ప్రెస్ క్లబ్‌లో శనివారం టీయూడబ్ల్యూజే(ఐజేయూ) ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తై ఐదేళ్లు అయింది.. లక్షల ఎకరాలకు ఇప్పటికే నీళ్లొచ్చినయ్.. బ్రహ్మండంగా పంటలు పండుతున్నాయ్.. ధాన్యం ఉత్పత్తులు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి.. టేలాండ్ ప్రాంతాలకు నీళ్లు వస్తున్నాయి.. ఎన్నో ఘనతలు ఉన్నాయన్నారు. ప్రతిపక్షాలకు ఒక అలవాటుగా మారిందని, అన్నారం పంపు హౌజ్ మునిగితే.. సంబరపడి ఒక కోకిల ముందే కూసింది.. అన్నట్లు అయిపోంది. కాళేశ్వరం మునిగిపోయిందని పైశాచిక ఆనందంను ప్రదర్శించాయని దుయ్యబట్టారు.
వాస్తవం ఏందీ.. ఒక్కపైసా ఖర్చు లేకుండా.. ఒక్కపైసా అదనపు భారం లేకుండా మొత్తం అన్నారం పంపుహౌజ్‌ను అదే ఏజెన్నీ బాగుచేసిం పునరుద్దరించింది. ఇప్పుడు కూడా ఒక్కపైసా భారం పడకుండా మేడిగడ్డను కూడా అదే ఏజెన్సీ పునరుద్దరిస్తుందన్నారు. మేడిగడ్డతో టేలండ్ ప్రాంతాలకు నీరందిస్తున్నారు. మన ప్రాంతాన్ని, మన ప్రాజెక్టులను తక్కువ చేసుకోవద్దు. ప్రతిపక్షాలు అనేవి విమర్శలు చేయాలి తప్పేమీలేదు.. కానీ ఈరకంగా కేవలం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బట్టకాల్చి మీద వేసి.. ఏదో ఒకటి చేసైనా బట్టకాల్చి మీద వేసి బద్నాం చేయాలనుకుంటే తగదన్నారు. అది ప్రజల ఆస్తి అని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పగ, కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడితే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జైల్లో ఊచలు లెక్కబెడుతుండేవాడు. బహుశా రేపు ఎప్పుడైనా పోతాడేమో అని కేటీఆర్ ఆసక్తికర కామెంట్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ తొమ్మిదన్నరేళ్లుగా మార్పు కోసం రాజకీయాలు చేస్తోందని, కానీ విపక్ష పార్టీలు మాత్రం ప్రభుత్వాలను మార్చేందుకు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. 2014కు ముందు దళిత ముఖ్యమంత్రి చేస్తామన్న మాట వాస్తవమేనన్నారు. 2014, 2018లో సీఎం కేసీఆర్ అనే ఎన్నికలకు వెళ్లామని, ఇప్పుడు అదే నినాదంతో వెళ్తున్నామని ప్రజలు ఆశీర్వదిస్తారన్నారు.
మైనార్టీల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్నామని, రాష్ట్ర బడ్జెట్‌లో 2100 కోట్లు కేటాయించామని తెలిపారు. 11 సార్లు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చినా రైతుబంధు లాంటి ఆలోచన రాలేదన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్‌కు నక్కకు నాగలోకి ఉన్నంత తేడా ఉందన్నారు. ఏపీలో కాంగ్రెస్ కుప్పకూలిందని, తెలంగాణలోనైనా 4 సీట్లు వస్తాయని ఆ పార్టీ ఆరాటమని విమర్శించారు. అభివృద్ధి ఆధారంగా తాము ఓట్లు అడుగుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీది విచిత్రమైన పరిస్థితి ఉందన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ 105 సీట్లలో డిపాజిట్లు కోల్పోయిందని, ఈ ఎన్నికల్లో కూడా 110 స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్లు రావని స్పష్టం చేశారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీని మార్చి ఇప్పుడు బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు డిమాండ్ ఎప్పటినుంచో ఉందని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం బీసీ జనగణన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. మోడీ బీసీ అయినంత మాత్రానా, బీసీలు సీఎంలు, పీఎంలు అయితే ఆ జాతి బాగుపడుతుందని అనుకోవడం లేదన్నారు. కులం కంటే గుణం ముఖ్యం అన్నారు. ఒక్కపదవి వస్తే సంతోషపడతారు కానీ పదవికంటే పథకాలే ముఖ్యమన్నారు. బీజేపీకి డిపాజిట్లు పోతాయని భావించి ఆ నెపం బీసీలపై మోపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
తాము ప్రజలను నమ్ముకున్నామని.. పోల్ మేనేజ్‌మెంట్లను కాదన్నారు. తెలంగాణలో ఎలాంటి వివక్ష లేకుండా ప్రభుత్వం పరిపాలన చేస్తున్నామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కర్ణాటకను మోడల్‌గా చూపిస్తున్నారని, అక్కడ 5 గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. కన్నడ రైతులు ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నారని చెప్పారు. కర్ణాటకకు అందరం ఓకే బస్సులో వెళ్లి రైతుల పరిస్థితిపై ఆరా తీద్దాం సిద్ధమా అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. ఎవరు ఏం చేస్తున్నారనేది స్పష్టమవుతుందన్నారు. కాంగ్రెస్ అన్ని రంగాల్లోనూ అన్యాయం చేస్తూ అరిగోసపెడుతుందని మండిపడ్డారు.
మేమంతా ఇంటికి పోవాల్సి వస్తే పోతాం
బీఆర్ఎస్‌లోనే కాదు.. ఏ పార్టీలోనూ మహిళలకు ఎక్కవ సీట్లు కేటాయించలేదన్నారు. అన్ని రాజకీయ పార్టీలను నిందించాల్సిందేనన్నారు. మహిళా బిల్లు కోసం 8 ఏళ్ల క్రితం అసెంబ్లీ తీర్మాణం చేయడంతో పాటుపార్లమెంట్‌లో సైతం పోరాటం చేశామన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తే అందరికి అవకాశాలు వస్తాయన్నారు. అప్పుడు బీఆర్ఎస్‌లో మహిళలదే పైచెయ్యి అవుతుందని, మేమంతా ఇంటికి పోవాల్సి వస్తే పోతామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ స్థానిక సంస్థల్లోనూ, మార్కెట్ కమిటీల్లోనూ 50శాతం రిజర్వేషన్లు మహిళలకు కేటాయిస్తున్నామని వెల్లడించారు.
‘మా బతుకు, మా తలరాత ప్రజల చేతిలో ఉందని స్పష్టం చేశారు. మీడియా మేనేజ్ మెంట్లు, సోషల్ మీడియా మేనేజ్ మెంట్లు.. పోల్ ఏజెన్సీల మేనేజ్ మెంట్లు.. చేసేవారు చేసుకుంటారు.. వాటిమీద ఆదారపడటం వారి బతుకు అని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ప్రజలపై అచంచల విశ్వాసంతో ఉన్నాం.. ప్రగతికి ప్రోగ్రెస్‌కి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.