Congress MP: ఏ ఇబ్బంది ఉన్నా హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు చెప్పండి

హైడ్రాలో అక్రమ కట్టడాలను కూల్చడమే కాకుండా, వాటికి అనుమతులు ఇచ్చిన ఆఫీసర్లపై కూడా చర్యలు ఉంటాయని ఎంపీ చామల కిరణ్​కుమార్ హెచ్చరించారు.

Update: 2024-08-21 13:11 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైడ్రాలో అక్రమ కట్టడాలను కూల్చడమే కాకుండా, వాటికి అనుమతులు ఇచ్చిన ఆఫీసర్లపై కూడా చర్యలు ఉంటాయని ఎంపీ చామల కిరణ్​కుమార్ హెచ్చరించారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా ఎవరూ తప్పు చేసినా, బాధ్యత వహించాల్సిందేనని చెప్పారు. సంపూర్ణమైన ఎంక్వైరీ తర్వాత చర్యలు ఉంటాయన్నారు. కళ్లు మూసుకొని ఆఫీసర్లు ఎలా అనుమతులు ఇస్తారు? అని ప్రశ్నించారు. భవిష్యత్‌లో నష్టం రాకూడదనే రాష్ట్రంలో హైడ్రా యాక్షన్ల ప్లాన్ కొనసాగుతుందన్నారు. ఇల్లీగల్ కన్ స్ట్రక్షన్స్ అన్నీ కూల్చేస్తామన్నారు. బఫర్ జోన్, ఎఫ్​డీఎల్‌లో ఎవరి భూములు ఉన్నా, ఆధారాలు అందజేస్తే వెంటనే కూలిపోతాయన్నారు. నిపక్షపాతంగా హైడ్రా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్‌పై బురద, రాళ్లు వేసే పని పెట్టుకున్నదని విమర్శించారు. జన్వాడ ఫామ్ హౌజ్ నిబంధనలు ఉల్లంఘించి కట్టారన్నారు.

గతంలో తనదే అన్నట్లుగా వ్యవహరించిన కేటీఆర్, ఇప్పుడు తన దోస్త్ నుంచి లీజుకు తీసుకున్నానని మాట మార్చుతున్నారని మండిపడ్డారు. పిరంగి కాల్వలను పూడ్చి ఫామ్ హౌజ్‌లను కట్టారనే గతంలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు వాస్తవాలు తెలిపే ప్రయత్నం చేశారన్నారు. కానీ అరెస్టు చేసి తీవ్రవాదులు ఉంటే బ్యారక్‌లలో పెట్టారన్నారు. హైడ్రా అంశంలో కేటీఆర్ డబుల్ గేమ్ ఆడుతుండన్నారు. ఒక వైపు కూల్చాల్సిందేనంటూ, మరోవైపు జన్వాడ ఫామ్ హౌజ్ కూల్చొద్దంటూ కోర్టు మెట్లు ఎక్కారని గుర్తు చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులున్నా, లిఖిత పూర్వకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఇవ్వాల్సిందిగా కోరారు. హైడ్రా పారదర్శకంగా పనిచేస్తుందన్నారు. పేదలకు అన్యాయం జరిగితే ప్రభుత్వమే న్యాయం చేసే దిశగా ఆలోచిస్తుందన్నారు. ఇక రుణమాఫీ సక్సెస్ అయిందన్నారు. కొన్ని కరెక్షన్స్ పెండింగ్ లో ఉన్నాయని, త్వరలోనే అర్హులందరికీ రుణమాఫీ లభిస్తుందన్నారు. బీఆర్ఎస్ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని కోరారు. పదే పదే ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదన్నారు.

Tags:    

Similar News