Heavy Rain Alert: వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక.. ఏడు రోజులు భారీ వర్షాలు.. ఎక్కడంటే?

వాతావరణ శాఖ ప్రజలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

Update: 2025-04-24 03:06 GMT
Heavy Rain Alert: వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక.. ఏడు రోజులు భారీ వర్షాలు.. ఎక్కడంటే?
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: వాతావరణ శాఖ ప్రజలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రాబోయే ఏడు రోజుల పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. దేశంలోని ఈశాన్య, దక్షిణ ప్రాంతాలలో భారీ వర్షాలు కొనసాగవచ్చని IMD పేర్కొంది. ఈ క్రమంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. . ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. అలాగే దక్షిణ భారత దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా.

ఈ నేపథ్యంలో అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. అస్సాంలోని గౌహతిలో మంగళవారం ఉదయం భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రెండు మూడు గంటల పాటు కురిసిన వర్షం కారణంగా.. నగరంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక నిన్న(బుధవారం) కూడా భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో రాబోయే 24 గంటల్లో అస్సాంతో పాటు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో కూడా భారీ వర్షాలు, బలమైన గాలులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

అయితే.. వాయువ్య బీహార్ మీదుగా తుఫాను ఏర్పడిందని.. ఇది మన్నార్ గల్ఫ్ వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి ఏర్పడుతుంది. దీని ప్రభావంతో రాబోయే 7 రోజులు ఈశాన్య భారతదేశంలో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ నెల(ఏప్రిల్) 22-27 మధ్య అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు నాగాలాండ్, మణిపూర్, మిజోరం మరియు త్రిపురలలో కూడా భారీ వర్షాలు కురిస్తాయని పేర్కొంది.

ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా. ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మరియు రాయలసీమలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.

Tags:    

Similar News