TG Assembly: కౌలు రైతులకు శుభవార్త.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక ప్రకటన
= రైతు కూలీలకు రూ.2 వేలు ఇస్తాం = రూ.7 లక్షల కోట్ల అప్పు చేసినట్లు కేటీఆర్ ఒప్పుకున్నారు = ఆగష్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనర్హులకు కూడా రైతుబంధు ఇచ్చారని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంలో అర్హులైన రైతులందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటామని హామీ ఇచ్చారు. కౌలు రైతులను కూడా తప్పకుండా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. రైతు కూలీలకు కూడా రూ.2 వేలు ఇచ్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. తమ ప్రభుత్వం ఫసల్ బీమా కూడా అమలు చేసేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఘోరంగా తయారు చేసిందని అన్నారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వల్లే దేశం అభివృద్ధి బాటలో పయనించిందని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో రూ.7 లక్షల కోట్ల అప్పు చేసినట్లు కేటీఆర్ ఒప్పుకున్నారని గుర్తుచేశారు. ఆ రూ.7 లక్షల కోట్లు ఎక్కడ పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని.. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.1.50 లక్షల వరకు రుణాలు మాఫీ అయ్యాయని అన్నారు. ఆగష్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీని కచ్చితంగా చేస్తామని వెల్లడించారు.