కాళ్లబేరానికి సిద్ధమైన కేసీఆర్.. ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం రిక్వెస్టు!

నిన్నటి వరకూ బీజేపీపై తిట్ల పురాణం అందుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఇప్పుడు ప్రధాని మోడీతో స్నేహానికి నయా ప్లాన్ రచిస్తున్నారు.

Update: 2024-02-20 02:43 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: నిన్నటి వరకూ బీజేపీపై తిట్ల పురాణం అందుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఇప్పుడు ప్రధాని మోడీతో స్నేహానికి నయా ప్లాన్ రచిస్తున్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోవడం.. కేంద్రంతో సఖ్యత లేకపోతే మొదటికే మోసం వస్తుందని భావించి ఫ్రెండ్లీ రిలేషన్స్ కోసం ప్రయత్నాలు షురూ చేసినట్లు సమాచారం. అందుకోసం పీఎం మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అపాయింట్‌మెంట్ అడిగినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నదని తెలిసింది. ఈ నెల 22 తర్వాత కేసీఆర్ ఎప్పుడైనా ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిసింది. పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో కేసీఆర్ టూర్ బీఆర్ఎస్‌లో చర్చనీయాంశంగా మారింది.

రెండేళ్లుగా దూరం

2022 ఫిబ్రవరి 5న చిన్నజీయర్ స్వామి నిర్మించిన సమతామూర్తి విగ్రహావిష్కరణకు పీఎం మోడీ హాజరయ్యారు. అప్పటి నుంచి కేసీఆర్ డిస్టెన్స్ పాటిస్తున్నారు. రాష్ట్రంలో రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ, బిజినెస్ స్కూల్, వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం.. ఇలా ఏ ప్రోగ్రామ్‌కు మోడీ వచ్చినా కేసీఆర్ స్వాగతం పలుకలేదు. రెండేళ్లుగా ఆయనతో దూరంగానే ఉన్నారు.

పొత్తు కోసమేనా?

ఇప్పటికే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. కొంతమంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారేందుకు సంప్రదింపులు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత హస్తం గూటికి చేరారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇక రామమందిరం విషయంలో బీజేపీకి ప్రజల్లో కొంత సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఈ క్రమంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే గట్టెక్కొచ్చని కేసీఆర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అందుకే ఆయన ఢిల్లీ వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ పొత్తు కుదరకపోతే బీఆర్ఎస్ బలహీనంగా ఉన్న లోక్ సభ స్థానాల్లో బీజేపీకి పరోక్షంగా సహకారం అందజేస్తామని హామీ ఇస్తారా? అనేది చర్చనీయాంశమైంది.

వ్యతిరేకిస్తున్న బీజేపీ రాష్ట్ర నేతలు

బీఆర్ఎస్‌తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని బీజేపీ స్టేట్ లీడర్లు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయిందని, అన్నిలోక్ సభ స్థానాల్లోనూ పోటీ చేస్తామని పేర్కొంటున్నారు. పొత్తుపై జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు ఒకరిద్దరు మినహా మిగతావారెవరూ నోరు మెదపడం లేదు. పార్టీ అధినేత కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకోబుతున్నారని గమనిస్తున్నారు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి పోత్తుపై చర్చిస్తారా? ఒకవేళ పొత్తు ఉంటే తమ పరిస్థితి ఏంటి? అనేది ఆ పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News