మేడారం జాతర వేళ CM రేవంత్ ప్రభుత్వానికి KCR రిక్వెస్ట్
మేడారం సమక్క, సారలమ్మ మహా జాతర వేళ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు చెప్పారు.
దిశ, వెబ్‌డెస్క్: మేడారం సమక్క, సారలమ్మ మహా జాతర వేళ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి మేడారం మహా జాతర చారిత్రక ప్రతీక అని అన్నారు. రెండేండ్లకోసారి జరిగే ఈ జాతర.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద అడవిబిడ్డల జాతరగా, తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కొనసాగిన ఆత్మగౌరవ పోరాటంలో, సమ్మక్క, సారలమ్మ అందించిన స్ఫూర్తి ఇమిడివున్నదని కేసీఆర్ పేర్కొన్నారు.
ఒకనాడు కల్లోలిత ప్రాంతంగా నాటి సమైక్యపాలకుల ఏలుబడిలో అలజడులకు గురైన గోదావరీలోయ పరీవాహక ప్రాంతం నేడు సాగునీటి జీవజలంతో సస్యశ్యామలమై ప్రజల జీవితాల్లో సాంత్వన నింపిందని అన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి, దేశవ్యాప్తంగా తల్లుల దర్శనార్థం కోట్లాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వసతులు కల్పించాలని ప్రభుత్వానికి బీఆర్ఎస్ అధినేత సూచించారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నిండేలా చూడాలని వనదేవతలను కేసీఆర్ ప్రార్థించారు.