‘అంతా ఉత్తిదే’.. కూతురు కవిత అరెస్ట్‌పై తొలిసారి నోరువిప్పిన కేసీఆర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తన కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌ కావడంపై గులాబీ బాస్ కేసీఆర్ తొలిసారి స్పందించారు.

Update: 2024-04-18 12:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తన కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌ కావడంపై గులాబీ బాస్ కేసీఆర్ తొలిసారి స్పందించారు. తెలంగాణ భవన్‌లో గురువారం జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అంతా ఉత్తిదేనని.. ముమ్మాటికి కవిత అరెస్ట్ అక్రమని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేయడానికి మనం పోలీసులను పంపించినామని.. దీంతో అప్పటి నుండి ప్రధాని మోడీ తనపై కక్ష కట్టారని అన్నారు. అందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపించాడని కేసీఆర్ ఆరోపించారు.

బీఎల్ సంతోష్‌పై మనం కేసు పెట్టకపోతే కవిత అరెస్టు ఉండకపోయేదన్నారు. కవితను కుట్రపూరితంగానే లిక్కర్ కేసులో ఇరికించారని కేసీఆర్ ఆరోపించారు. లిక్కర్ స్కామ్ కేసులో కవిత తప్పు చేసినట్టు 100 రూపాయల ఆధారం కూడా చూపెట్టలేరని అన్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఎమ్మెల్సీ కవితను ఈడీ మార్చి 15వ తేదీన అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో కూతురు అరెస్ట్‌పై కేసీఆర్ నెలదాటిన తర్వాత నోరు విప్పడం గమనార్హం.


Similar News