సెప్టెంబర్ 17 వేడులకు దూరంగా కేసీఆర్
హైదరాబాద్ సంస్థానం దేశంలో కలిపిన రోజు సెప్టెంబర్ 17. ఈ రోజును అన్ని పార్టీలు ఘనంగా నిర్వహిస్తున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ సంస్థానం దేశంలో కలిపిన రోజు సెప్టెంబర్ 17. ఈ రోజును అన్ని పార్టీలు ఘనంగా నిర్వహిస్తున్నాయి. క్షేత్రస్థాయి నుంచి వేడుకలు నిర్వహించాలని పిలుపునిచ్చాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం దూరంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. అన్ని పార్టీలు పోటీ పడి కార్యక్రమాలు నిర్వహిస్తుంటే గులాబీ అధిష్టానం పార్టీ నేతలకు పిలుపునివ్వకపోవడంతో కేడర్ నైరాశ్యంలో ఉంది. దీంతో పార్టీ తీరు చర్చనీయాంశమైంది. అధికారం కోల్పోయినా ప్రజలకు దూరమేనా? అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ సమైక్యత దినోత్సవంపై బీఆర్ఎస్ సైలెంట్!
సెప్టెంబర్ 17ను కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన దినోత్సవం, బీజేపీ విమోచన దినోత్సవం, సీపీఎం, సీపీఐలు విలీన దినోత్సవాలుగా నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రధానప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాత్రం సైలెంట్‌గా ఉన్నది. జాతీయ సమైక్యత దినోత్సవాన్ని గ్రామస్థాయిలో నిర్వహించాలని కేడర్‌కు పిలుపునివ్వలేదు. కేవలం పార్టీ ఆఫీసులో జెండాను ఎగురవేసి కంప్లీట్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఏ పార్టీ అయినా ఏదైనా కార్యక్రమం వచ్చిందంటే దానిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కేడర్‌లో జోష్ నింపాలని ప్రయత్నిస్తుంది. కానీ గులాబీ పార్టీ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటంతో పార్టీ అనుసరిస్తున్న తీరు కేడర్‌లో చర్చనీయాంశమైంది.
సెప్టెంబర్ 17 సెలబ్రేషన్స్ ఒక్కసారే...
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పదేండ్లు అధికారంలో ఉంది. అయినప్పటికీ సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని కార్యక్రమాలను నిర్వహించలేదు. 2022లో మూడురోజులపాటు జాతీయ సమైక్యత దినం పేరుతో కార్యక్రమాలు నిర్వహించింది. 2023లో రెండోసారి నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా పార్టీ కేంద్రకార్యాలయంలో మాత్రమే జెండాను ఎగురవేసి ముగించింది. దీంతో సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ జాతీయ సమైక్యతా ఉత్సవాలను గ్రామస్థాయి నుంచి నిర్వహించాలని కేడర్‌కు పిలుపునివ్వకపోవడంతో నైరాశ్యం నెలకొంది. అన్నిపార్టీలు నిర్వహిస్తుంటే గులాబీ శ్రేణులు మాత్రం సైలెంట్‌గా ఉండాల్సిన పరిస్థితి. ఇప్పటికే ఓ వైపు ఓటమి, మరోవైపు పార్టీ కార్యక్రమాలు లేక కేడర్ నైరాశ్యంలో ఉంది. ఇప్పుడు జాతీయ సమైక్యత దినోత్సవాన్ని సైతం ఆసరాగా చేసుకొని ప్రజల్లోకి వెళ్లకపోవడంతో పార్టీలో ఏం జరుగుతుందో తెలియక ఆందోళన నెలకొంది.
వేడుకల్లో కేసీఆర్ పాల్గొనడంపై నో ఇన్ఫో
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉన్నారు. అయన సమైక్యతా దినోత్సవంలో ఎక్కడా పాల్గొంటున్నట్టు సమాచారం లేదు. అంటే హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణలో విలీనం కావడం ఇష్టం లేకనా? లేక ఎంఐఎం మిత్రపక్షంగా ఉండటంతోనే కార్యక్రమాలకు దూరమా? అనేది చర్చనీయాంశమైంది. అధికారంలో ఉన్నప్పుడు జాతీయ సమైక్యత దినోత్సవంను నిర్వహించడం విమర్శలకు దారి తీసింది. ఇప్పుడు కూడా అదే పేరును ప్రస్తావిస్తున్నారు. కానీ పార్టీ శ్రేణులకు మాత్రం కార్యక్రమాలు చేపట్టాలని పిలుపును ఇవ్వకపోవడంతో పార్టీ శైలిపై కేడర్‌లో చర్చ జరుగుతోంది.
ప్రజలకు దూరమేనా?
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంది. కేవలం రైతుల అంశంపై మాత్రం నిరసనలకు పిలుపునిచ్చినా ఆశించిన మేర సక్సెస్ కాలేదని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక అంశాలపై ప్రజల్లోకి వెళ్తామని పార్టీ పేర్కొన్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు. సెప్టెంబర్ 17 అంశం ప్రజల మధ్యకు వెళ్లే అవకాశం వచ్చింది. కానీ పార్టీ కేడర్‌కు పిలుపు ఇవ్వలేదు. దీంతో బీఆర్ఎస్ ప్రజలకు దూరమైనట్లేనా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే కేడర్ అంతా సైలెంట్‌గా ఉండటంతో అసలు పార్టీ ఉన్నదా? లేదా? అనే అనుమానాన్ని రేకెత్తిస్తోంది. ఏ అంశాలతో ప్రజలకు దగ్గరవుతోంది చూడాలి.
నేడు భవన్‌లో కేటీఆర్ జెండా ఆవిష్కరణ
జాతీయ సమైక్యత దినోత్సవం సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని పార్టీ కేంద్రకార్యాలయం తెలంగాణ భవన్‌లో మంగళవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.