మూర్ఖుడు చంద్రబాబుతో అప్పుడే మొరపెట్టుకున్నా.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో పరిపాలనపై అవగాహన లేని దద్దమ్మలు రాజ్యమేలుతున్నారని మాజీ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. శుక్రవారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఎండిన పంటలను కేసీఆర్ పరిశీలించారు.

Update: 2024-04-05 13:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పరిపాలనపై అవగాహన లేని దద్దమ్మలు రాజ్యమేలుతున్నారని మాజీ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. శుక్రవారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఎండిన పంటలను కేసీఆర్ పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో 20 లక్షల ఎకరాల మేర పంట ఎండిపోయిందన్నారు. ఇది కాలం తెచ్చిన కరువా? కాంగ్రెస్ తెచ్చిన కరువా? అని ప్రశ్నించారు. నీటి నిర్వహణ తెలియని దద్దమ్మలు రాజ్యమేలితే ఇలాగే ఉంటుందని అన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఏనాడూ కరెంట్ కోతలు చూడలేదని.. ప్రస్తుత కరెంట్ కోతలతో ప్రజలు, రైతులు అల్లాడిపోతున్నారని గుర్తుచేశారు. రైతులను ఓదార్చకపోగా.. వర్షాపాతం లేదని మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 25 జిల్లాల్లో పడాల్సిన దానికంటే ఎక్కువ వర్షమే పడిందని కేసీఆర్ అన్నారు.

వంద రోజుల్లోనే 200 మంది రైతులు చనిపోవడం దారుణమని ఆవేదన చెందారు. చనిపోయిన రైతుల వివరాలు 48 గంటల్లో ఇవ్వాలని సీఎం అడిగితే.. 4 గంటల్లోనే పంపించానని తెలిపారు. పరిహారం ఇవ్వకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి చనిపోయిన రైతులు ఉసురు తగులుతుందని శాపం పెట్టారు. కొత్త ప్రభుత్వంపై వెంటనే విమర్శలు చేయొద్దని.. నాలుగు నెలల సమయం ఇచ్చినట్లు తెలిపారు. కానీ, రైతుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని ఆవేదన చెందారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదలమని.. రైతులకు న్యాయం జరిగే వరకు వెంటపడతామని హెచ్చరించారు. తాను ఎక్కడికి వెళితే.. అక్కడ పంటల పొలాలకు నీళ్లు వదులుతున్నారని ఎద్దేవా చేశారు. రైతుబంధు, రుణమాఫీ విడుదల చేయకుండా రైతాంగాన్ని చిత్రహింసలకు గురిచేస్తున్నారని అన్నారు.

కల్యాణ లక్ష్మిలో లక్ష సాయంతో పాటు తులం బంగారం, నాలుగు వేల పెన్షన్ ఇస్తామని గొప్పలకు పోయి ఇప్పుడు సప్పుడు చేస్తలేరని విమర్శించారు. పథకాలు అందని వారు మంత్రులను తరిమికొడతారని అన్నారు. దళితబంధు ఇవ్వకుండా దళితులను, గొర్రెల పంపిణీ ఆపేసి యాదవులను, చేనేతలను ఇలా అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలువునా ముంచిందని మండిపడ్డారు. చేనేతలను ఆదుకోవాలని మూర్ఖుడు చంద్రబాబుకు అప్పట్లో మొరపెట్టుకున్నా కూడా వినలేదు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వారిని కంటికి రెప్పలా కాపాడుకున్నాం.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ ఆత్మహత్యలు చేసుకునే రోజులు దాపురించాయని ఆవేదన చెందారు.

Tags:    

Similar News