KCR: గులాబీ బాస్ ‘బేఫికర్’.. 13 నెలలుగా ఫాంహౌజ్‌లోనే మకాం

రాష్ట్రంలో రాజకీయాలు కొత్త ట్రెండ్‌కు దారితీస్తున్నాయా..? గెలిస్తేనే ప్రజల్లో ఉంటాం.. ‘ఓడిపోతే ఫామ్‌హౌస్‌కే పరిమితం అవుతాం’.. అన్న ధోరణితో పొలిటికల్ లీడర్లు ఉన్నారా..? ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరి చూస్తే ప్రజల్లో ఇవే అనుమానాలు కలుగుతున్నాయి.

Update: 2025-01-03 01:44 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాజకీయాలు కొత్త ట్రెండ్‌కు దారితీస్తున్నాయా..? గెలిస్తేనే ప్రజల్లో ఉంటాం.. ‘ఓడిపోతే ఫామ్‌హౌస్‌కే పరిమితం అవుతాం’.. అన్న ధోరణితో పొలిటికల్ లీడర్లు ఉన్నారా..? ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరి చూస్తే ప్రజల్లో ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. రెండు పర్యాయాలు సీఎంగా పని చేసిన కేసీఆర్.. స్వరాష్ట్రంలో మొదటిసారి అధికారాన్ని కోల్పోయారు. దాంతో ఆయన 13 నెలలుగా ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారు. అయితే.. ‘అధికారంలో ఉంటేనే ప్రజల్లో ఉంటా.. ప్రజా సమస్యలు పట్టించుకుంటా.. అధికారమే లేనప్పుడు నాకేం పని’ అన్నట్లుగా గులాబీ బాస్ వైఖరి ఉండడంతో ప్రజల్లో మరింత అసంతృప్తి పెరుగుతున్నది. కేవలం పార్లమెంటు ఎన్నికల సందర్భంలో వచ్చి ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్.. ఆ తర్వాత నుంచి బయటకు వచ్చిన దాఖలాలు లేవు. ఇటీవల జాతీయ స్థాయిలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, సీతారాం ఏచూరి, రతన్​టాటా లాంటి ప్రముఖులు చనిపోయిన సందర్భాల్లోనూ ఆయన బయటికి వచ్చి నివాళులు అర్పించలేదు.

ఓటమిని పాజిటివ్‌‌గా తీసుకోని బీఆర్ఎస్

ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. ఎన్నికల్లో ఒకరికి మాత్రమే విజయం దక్కుతుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ 11 ఏళ్లుగా ప్రతిపక్ష నేతగా పోరాడుతూనే ఉన్నారు. ఇటు కర్ణాటకలో బీజేపీ, ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్​యాదవ్, శరద్​పవార్, ఆంధ్రప్రదేశ్‌లో ఆరు నెలల క్రితం వరకు చంద్రబాబునాయుడు, ప్రస్తుతం వైఎస్​జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. వారు అధికారం కోల్పోయినా నిత్యం ప్రజల్లోనే ఉండిపోయారు. కానీ.. తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి నెలకొందని రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త సమయం ఇద్దామని.. అందుకే కేసీఆర్ బయటకు రావడం లేదని కొన్నాళ్లు ప్రచారం జరిగింది. దాంతో ప్రజల్లో కాస్త కేసీఆర్ పట్ల సానుభూతి కనిపించింది. మరోవైపు.. కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కేటీఆర్, హరీశ్‌రావు, కవిత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. మొదటి వారం నుంచే కొత్త ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రారంభించారు.

అసెంబ్లీకి సైతం డుమ్మా..

కాంగ్రెస్​ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు గడిచింది. కానీ.. ప్రజా సమస్యలపై నిత్యం ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన కేసీఆర్ మాత్రం బయటకు రావడం లేదు. కనీసం అసెంబ్లీ సమావేశాలకు చుట్టపు చూపుగానైనా హాజరుకావడం లేదు. దీంతో రాజకీయంగా ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల నుంచీ వ్యతిరేకత వస్తున్నది. మీడియా, ప్రజలు, మేథావుల నుంచి ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. వీరందరికీ ఎలా సమాధానం చెప్పుకోవాలే అర్థం కాక పార్టీ ముఖ్య నేతలు లోలోపల ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే గ్రామ స్థాయి కేడర్​అధికార పార్టీ వైపు జంప్​అయ్యింది. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కేసీఆర్​బయటికి రాకపోవడంపై పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఫామ్‌హౌస్‌లో పార్టీ నాయకులు కేసీఆర్‌ను కలిసినప్పుడల్లా బయటికి రావడంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఆ సమయంలో ‘కాంగ్రెస్‌కు ఓట్లు వేసి.. తనను బయటికి రమ్మంటే ఎలా వస్తాను’ అంటూ బీఆర్ఎస్ అధినేత వారితో వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఎన్నికల సమయంలోనే చెప్పానని.. తానేమీ కొత్తగా చేయడంలేదని.. చెప్పిన పనినే చేస్తున్నానని పార్టీ నాయకులతో అన్నట్లుగా సమాచారం.

అప్పుడు బీరాలు పలికి..

కాంగ్రెస్​ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ‘ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది.. వచ్చే ఆరు నెలల్లో మన ప్రభుత్వమే రాబోతుంది’ అని పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కేసీఆర్ గొప్పలు చెప్పారు. ఆ తర్వాత ఈ తేదీని కాస్తా దసరాకు, ఆ తర్వాత డిసెంబర్ వరకూ వెళ్లిపోయింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పలు సందర్భాల్లో ఇలాంటి ప్రకటనలు చేశారు. కాంగ్రెస్​ఎమ్మెల్యేలు మన పార్టీలోకి వస్తున్నారంటున్నారని, కానీ.. తామే వద్దంటున్నామంటూ బీరాలు పలికారు. అవన్నీ ఒట్టి మాటలేనని తేలాయి. కాంగ్రెస్​ఎమ్మెల్యేలు రావడం కాదు కదా బీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేల్లో కొంత మంది అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. ఈ ప్రకటనల ప్రభావం కాస్త లోక్‌సభ ఎన్నికలపై పడి పార్టీని జీరో సీట్ల స్థాయికి దిగజార్చింది. ఓట్ల శాతం సైతం గణనీయంగా పడిపోయింది.

కేసీఆర్ వైఖరిపై కేటీఆర్ స్పష్టత

గెలిపిస్తే ప్రజల్లో ఉండి పనిచేస్తా.. లేకుంటే ఫామ్‌హౌజ్‌లో పడుకుంటా అంటూ కేసీఆర్​ఎన్నికలకు ముందే చెప్పారని కేటీఆర్ ఇటీవల గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డికి తాము చాలని.. పార్టీ కార్యకలాపాలు తాము చూస్తున్నామని.. కేసీఆర్ అవసరం లేదని కూడా చెప్పుకొచ్చారు. దీంతో ప్రజల పట్ల కేసీఆర్ వైఖరిని కేటీఆర్ చెప్పకనే చెప్పినట్టు స్పష్టమైంది. ఈ క్రమంలో కేసీఆర్​క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారా..? లేదా..? అన్న చర్చ షురూ కాగా.. ఇక నుంచి పార్టీని కేటీఆర్, కవితలే చూసుకుంటారా..? అనే కోణంలోనూ బయట డిస్కషన్ సాగుతున్నది. 2018, 2023 ఎన్నికల సమయంలో అచ్చంపేట, ఖానాపూర్​నియోజకవర్గాల్లో నిర్వహించిన సభల్లో కేసీఆర్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బీఆర్ఎస్‌ను ఓడగొడితే నాదేం పోతుంది. హాయిగా ఇంట్లో రెస్ట్​తీసుకుంటా’ అని ప్రకటించారు. ఆనాడు చెప్పినట్టుగానే అధికారం కోల్పోయాకా కేసీఆర్ పూర్తిగా విశ్రాంతికే పరిమితం అయ్యారు.  

Tags:    

Similar News