బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ సీక్రెట్ మెసేజ్.. ఫామ్ హౌస్ లో విడతల వారీగా భేటీల వెనక మతలబు అదేనా?

వలసలను ఆపేందుకు కేసీఆర్ బుజ్జగింపుల పర్వాన్ని కంటిన్యూ చేస్తున్నారు.

Update: 2024-06-26 10:56 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : కాంగ్రెస్ ప్రారంభించిన ఆపరేషన్ ఆకర్ష్ నుంచి తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కసరత్తు ప్రారంభించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండో రోజు కూడా పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్‌లోకి వలస వెళ్తున్న నేపథ్యంలో వారిని ఆపేందుకు కేసీఆర్ బుజ్జగింపుల పర్వాన్ని కంటిన్యూ చేస్తున్నారు. నిన్న జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలతో భేటీ అయిన కేసీఆర్... ఇవాళ ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో మరో ఆరుగురు ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ముఖ్యంగా బీఆర్ఎస్‌ను వీడుతున్న ఎమ్మెల్యేలు, నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది.

హాజరైంది వీరే..

ఇవాళ మీటింగ్‌కు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎల్బీ‌నగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డితో పాటు పార్టీ నేతలు రసమయి బాలకిషన్, జీవన్‌రెడ్డి, సాయిచంద్ భార్య రజిని తదితరులు హాజరయ్యారు. వీరిలో మెజార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతానే ప్రచారం జరుగుతున్న జాబితాలోని వారే కావడం గమనార్హం.

విడతల వారీ వెనుక మతలబేంటీ?

అధికారం కోల్పోయిన తర్వాత కారు పార్టీలో భారీగా కుదుపులు ప్రారంభమయ్యాయి. లోక్ సభ ఎన్నికల ఫలితాలతో ఏ ఎమ్మెల్యే ఏ క్షణం పార్టీ మారుతారో అధినేతకే అంతుచిక్కడం లేదు. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ ఫ్యూచర్ పై కేడర్‌లోనూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయనే చర్చ జరుగుతోంది. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే కేడర్ ఇతర పార్టీల వైపు మళ్లే అవకాశం లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది. ఈ నేఫథ్యంలో వలసలను కడ్డటి చేసేందుకు రంగంలోకి దిగిన కేసీఆర్ ఎమ్మెల్యేలందరితో ఓకే దఫా సమావేశం నిర్వహించకుండా విడతల వారీగా సమావేశం కావడంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. వేర్వేరు మీటింగ్‌ల ద్వారా పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఇస్తున్న సీక్రెట్ సందేశం ఏంటనేది ఆసక్తిగా మారింది. పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది కాలమే సమాధానం చెప్పనున్నది.

Tags:    

Similar News