ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ పట్టభద్రుడు!.. కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్

గతంలో సన్న వడ్లు పండించాలని చెప్పిన కేసీఆర్ ఇప్పడు యూటర్న్ తీసుకున్నాడని, ప్రజలను మోసం చేయడంలో ఆయన పట్టభద్రుడు అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.

Update: 2024-05-23 14:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గతంలో సన్న వడ్లు పండించాలని చెప్పిన కేసీఆర్ ఇప్పడు యూటర్న్ తీసుకున్నాడని, ప్రజలను మోసం చేయడంలో ఆయన పట్టభద్రుడు అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. సన్న వడ్లు వేయ్యండి మార్కెట్ లో మంచిగ ఉంటది అని కేసీఆర్ గతంలో చెప్పిన వీడియోను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసి యాది మర్షినవా.. సన్న వడ్లు ఎయ్యమనేది నువ్వే వాటికి బోనస్ ఇస్తే అడ్డుపడేది నువ్వే?! గిట్లయితే ఎట్ల దొరా!! అని కామెంట్ చేసింది. కచరా గతంలో సన్న వడ్లు పండించాలని, రూ.100 బోనస్ కూడా ఇస్తామని చెప్పి మోసం చేశాడని, నేడు ప్రజా ప్రభుత్వం రైతులను ప్రోత్సహించడానికి సన్న వడ్ల సాగును పెంచాలని రూ.500 బోనస్ ఇస్తామంటే మాత్రం కచరా కుటుంబానికి ఎక్కడలేని బాధ కలుగుతుందని దుయ్యబట్టారు.

పేద ప్రజలకు ఇచ్చే రేషన్, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు, వినియోగదారులకు సరిపడా సన్న బియ్యం సరఫరా చేయడానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంటే.. బీఆర్ఎస్ నాయకులకు కళ్ళ మంట పుడుతుందని మండిపడ్డారు. 2014 లో రైతుల ఆదాయం డబుల్ చేస్తామని చెప్పి రైతుల అప్పులు డబుల్ చేసిన బీజేపీ కూడా.. బీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం విడ్డూరంగా ఉందని, ఎఫ్‌సీఐ సూచనలను బీజేపీ నాయకులు మరిచారా?, సన్న వడ్ల సాగును పెంచాలని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులకు చెప్పిన మాటలు ఉత్త మాటలేనా? అని ప్రశ్నించారు. ఇక కచరా గారు రైతులకు రుణమాఫీ చేయలేదు. పంట బీమా ఇవ్వలేదు. ఎరువులు ఉచితంగా ఇస్తామని చెప్పి దగా చేశాడు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనలేదు. పంట నష్టపోతే పరిహారం ఇవ్వలేదు. కోనుగోలు కేంద్రాల్లో దందాలను అడ్డుకోలేదని ఆరోపించారు.

కానీ రైతులను గోస పెట్టి, ప్రజా ధనాన్ని కొల్లగొట్టి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, బీఆర్ఎస్ నాయకులు పందికొక్కుల్లా పడి ఆర్థిక దోపిడీ చేసి, రాష్ట్రానికి అధోగతి పట్టేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక అధికారం పోయి 5 రోజులు కాకముందే.. ప్రజా ప్రభుత్వంపై పనిగట్టుకుని విష ప్రచారం చేస్తున్నారని, ఒక్క బడ్జెట్ ప్రవేశ పెట్టని 5 నెలల ప్రజా ప్రభుత్వం పై సొంత పత్రికలో, టీవీలో విషం చిమ్ముతూ.. ప్రజలని మభ్య పెట్టేందుకు కచరా, కేటీఆర్, హరీష్ రావులు సంక్రాంతి గంగిరెద్దుల్లా పోటీ పడుతున్నారని కాంగ్రెస్ ఎక్స్ లో రాసుకొచ్చింది.


Similar News