మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే కేసీఆర్ సర్కార్ లక్ష్యం: మంత్రి ఎర్రబెల్లి
2023-24 సంవత్సరానికి సెర్ప్ - పేదరిక నిర్మూలన సంస్థ, బ్యాంకు లింకేజీ లక్ష్యం రూ.15,037.40 కోట్లుగా నిర్ణయించామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: 2023-24 సంవత్సరానికి సెర్ప్ - పేదరిక నిర్మూలన సంస్థ, బ్యాంకు లింకేజీ లక్ష్యం రూ.15,037.40 కోట్లుగా నిర్ణయించామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. డ్వాక్రా మహిళలు, మహిళా సంఘాలు దేశానికే ఆదర్శం అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బ్యాంకు లింకేజీ వార్షిక ప్రణాళికను మంత్రి ఆవిష్కరించారు.
వివిధ కేటగిరీలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన మహిళలకు, అధికారులకు అవార్డులు అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. మహిళలు చిన్న తరహా నుంచి పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆంకాంక్షించారు. మహిళలకు వారి అవసరాలకు తగినన్ని నిధులను బ్యాంకులు రుణాలుగా ఇవ్వాలని, వీలైనంత వరకు మహిళలకు ఇచ్చేరుణాల నిబంధనలను సడలించాలన్నారు. వడ్డీ రేట్లు అన్ని బ్యాంకుల్లో ఒకే విధంగా ఉండేలా చూడాలని, సాధ్యమైనంత వరకు సర్వీసు చార్జీలు లేకుండా చూడాలని సూచించారు.
దేశంలో అత్యధికంగా మహిళల ద్వారానే 98శాతం రికవరీ ఉందని, దేశంలో 57శాతం మహిళలకు రుణాలు అందుతుంటే, మన రాష్ట్రంలో 76శాతం రుణాలు మహిళలకే ఇస్తున్నామన్నారు. సగటున ఒక్కో డ్వాక్రా సంఘానికి రూ.5,56,556 రుణాలుగా అందించామని వివరించారు. స్వయం సహాయక సంఘాల రుణ నిలువ ఈ ఏడాది 2023 మార్చి 31 నాటికి రూ.3,924.50 కోట్లుగా ఉందన్నారు. 2014-15 ఏడాది 3,738 కోట్లు రుణాలుగా ఇస్తే, 2022-23 ఏడాది 12,722 కోట్ల రుణాలు ఇచ్చామని తెలిపారు.
గ్రామీణ పేద మహిళలను స్వయం సంఘాలలో సభ్యులుగా చేర్చడంలో రాష్ట్రంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని, ఒక స్వయం సహాయక సంఘానికి సగటున రూ.10లక్షలు అంతకన్నా ఎక్కువ బ్యాంకు రుణం అందించడంలో దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నామన్నారు. స్వయం సహాయక సంఘాలకున్న బ్యాంకు రుణ నిల్వలో మరియు ఒక్కొక్క గ్రూపు రుణ నిల్వలో దేశంలో ద్వితీయ స్థానంలో ఉన్నామని తెలిపారు.
మహిళలు పెద్ద ఎత్తున రాష్ట్రావతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్ బీఐ ప్రతినిధి అమిత్, నాబార్డు సీజీఎం సుశీల చింతల, అనిల్ కుమార్, సెర్ప్ డైరెక్టర్ వై.ఎన్.రెడ్డి, సెర్ప్‌లోని వివిధ విభాగాల డైరెక్టర్లు, వివిధ సంఘాల మహిళలు, అధికారులు, డీఆర్ డీఓలు, ఏపీడీలు, తదితరులు పాల్గొన్నారు.