కేసీఆర్.. నా వెంట్రుక కూడా పీకలేవు.. రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

. కేసీఆర్ నీకు చేతనైతే నా వెంట్రుక పీకి చూపించు. నీకు నేనేంటో తెలుస్తుంది.

Update: 2024-02-14 13:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:సీఎం రేవంత్ రెడ్డి మరోసారి మాజీ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. కేసీఆర్ శాసనసభకు రాకుండా నల్గొండకు వెళ్లి బీరాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలిచ్చే బర్రె కాదు ఓ కంచర గాడిద అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తాను అసెంబ్లీ నుంచి వస్తుండగా ఓ అటెండర్ తనను పలకరించి తెలంగాణ ప్రజలు కంచర గాడిదను ఇంటికి పంపి.. రేసుగుర్రాన్ని తెచ్చుకున్నామని, ఏ రేస్ కు వెళ్లినా ఆ గుర్రానిదే గెలుపు అని, ఆ కంచర గాడిదకు మళ్లీ అధికారం అనేది కలలో అని మాట అని అసెంబ్లీలో ఆ అటెండర్ తనతో చెప్పారని అన్నారు. ఓ అటెండర్ కు ఉన్న ఇంగిత జ్ఞానం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్ కు ఎందుకు లేదన్నారు. బుధవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన పోలీస్ ఉద్యోగాల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి 15,750 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మళ్లీ వస్తానని కేసీఆర్ అంటున్నారు. ఒక వేళ కేసీఆర్ రావాలి అనుకుంటే కేసీఆర్ జైలుకే వెళ్తాడని అన్నారు. తన కుంటుంబం కోసం తెలంగాణను దోచుకున్న కేసీఆర్ ఇప్పుడు సానుభూతి కోసం చంపుతానంటున్నారంటూ డ్రామాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ మాటల మాయలో పడవద్దని ప్రజల పక్షాన పని చేసేందుకు 24 గంటలు పని చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు.

కేసీఆర్ నా వెంట్రుక పీకి చూపించు:

రాబోయే పదేళ్లు నేనే సీఎం బాధ్యతల్లో ఉంటానని ప్రజలు ఆశీర్వదిస్తే ఆ పై పదేళ్లు కూడా ఇందిరమ్మ రాజ్యమే ఉంటుందన్నారు. కేసీఆర్ నీకు చేతనైతే నా వెంట్రుక పీకి చూపించు. నీకు నేనేంటో తెలుస్తది. వెంబడే మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ అంటున్నారు. బిడ్డా ఎట్ల వస్తవో రా నేను ఇక్కడే ఉంటా నీ సంగతి ఏంటో చూస్తా. శాసనసభకు రావడానికి చేతకావడం లేదు కానీ నల్గొండకు వెళ్లారని దుయ్యబట్టారు. పదేళ్లు సీఎంగా ఉండి తెలంగాణకు తేవాల్సిన నీళ్లు తీసుకురాలేదు. ప్రాజెక్టులు కట్టలేదు. పదేళ్లుగా చేయని సమస్యలను పరిష్కరించుకుంటూ వెళ్తున్నాం. మేము అధికారంలోకి వచ్చి 69 రోజులైంది. అప్పుడే ఏం చేయలేదని శాపనార్ధాలు పెడుతున్నారని మండిపడ్డారు. అడ్డా మీద కొట్లాడితే కుదరదని కేసీఆర్ చట్టసభలకు రావాలన్నారు. కేసీఆర్ కు ఏదారి లేక నీళ్ల దారి పట్టి సెంటిమెంట్ ప్రయోగిస్తున్నారని ధ్వజమెత్తారు. మేడిగడ్డ బాగోతం బయటపడుతుందని కృష్ణాజలాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. నల్గొండ జిల్లా ప్రజలు చైతన్యవంతులు కావడం వల్ల అక్కడి యువకులు కోడిగుడ్లు, టమాటాలతో తిరిరగబడ్డరని, అక్కడ మన పోలీసులు ఉండటం వల్ల యువకులను అడ్డుకున్నారన్నారు. లేకపోతే వారి వీపులు చింతపండు చేసేవారని సెటైర్లు వేశారు. ఇంటికే నియామక పత్రాలు పంపొచ్చు కదా అని హరీశ్ రావు అంటున్నారు. కేసీఆర్.. తన బంధువులకు అనేక పదవులు కట్టబెట్టారని ధ్వజమెత్తారు.

Tags:    

Similar News