కామారెడ్డి నుంచి KCR పోటీ.. 9 గ్రామపంచాయతీల సంచలన నిర్ణయం

కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Update: 2023-08-26 06:27 GMT

దిశ, మాచారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా మాచారెడ్డి మండలంలోని ఉమ్మడి ఎల్లంపేట పరిధిలోని 9 గ్రామపంచాయతీలు కేసీఆర్‌ను గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానాలు మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నర్సింగారావుకు శనివారం ఉదయం అందించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఆధ్వర్యంలో ఎల్లంపేట మెయిన్ రోడ్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా తొమ్మిది గ్రామ పంచాయతీలకు సంబంధించిన తీర్మానాల కాపీలను ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీపీ‌కి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం ఏ విధంగానైతే ఏకగ్రీవ తీర్మానాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, అదే తరహాలో కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకొని కామారెడ్డి నియోజకవర్గ ప్రజల ఉద్యమ స్ఫూర్తిని చాటుతామని అన్నారు. ఈ తొమ్మిది గ్రామాల ప్రజల ఓట్లు కేవలం కారు గుర్తుకే వేసి కేసీఆర్‌కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు 9 గ్రామాల సర్పంచులు స్పష్టం చేశారు.

ఉమ్మడి ఎల్లంపేట గ్రామాల బాటలో మాచారెడ్డి మండలంలోని మరికొన్ని గ్రామాలు ఏకగ్రీవ తీర్మానాలకు సిద్ధమవుతున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో మాచారెడ్డి జెడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి, మండల వైస్‌ఎంపీపీ జీడిపల్లి నరసింహారెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ శనిగరం కమలాకర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..