Kavitha: ఇందిరమ్మ రాజ్యం కాదు.. ప్రజలు తిరగబడే రోజు వస్తుంది.. ఎమ్మెల్సీ కవిత హెచ్చరిక
ఇందిరమ్మ రాజ్యం ఎమర్జెన్సీ పాలనను తలపిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఇందిరమ్మ రాజ్యం ఎమర్జెన్సీ పాలనను తలపిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ఇవాళ బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు (Harish Rao), పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kashik Reddy) అరెస్టుల నేపథ్యంలోనే గచ్చిబౌలి పీఎస్‌కు ఎమ్మెల్సీ కవిత వెళ్లి హరీశ్‌రావు, ఇతర బీఆర్ఎస్ నేతలను పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదని, పోలీసు రాజ్యం నడుస్తోందన్నారు. బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టడం అన్యాయమన్నారు. బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదును సీఐ రిజెక్ట్ చేశారని ఆరోపించారు. ఎందుకు కంప్లైంట్ తీసుకోవడం లేదని పాడి కౌశిక్ రెడ్డి సీఐని ప్రశ్నించడం జరిగిందన్నారు. దీంతో తిరిగి పోలీసులు కౌశిక్ రెడ్డిపై కేసు పెట్టడం దారుణమన్నారు.
మార్నింగ్ 10 గంటలకు అరెస్ట్ చేసిన కౌశిక్ రెడ్డిని వివిధ సెక్షన్లు పెడుతూ ఇప్పటి వరకు రిమాండ్‌కు తరలించకుండా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనను డిటేన్షన్‌లో పెట్టాలనే ఉద్దేశంతో సాయంత్రం 5 గంటలకు కోర్టు మూసివేసే వరకు వెయిట్ చేశారని ఆరోపించారు. అదేవిధంగా పరమర్శించడానికి వచ్చే ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి కేసులు పెట్టడం చాలా అన్యాయమన్నారు. తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా అణిచివేతలను భరించదని, మీరు ఇలాగే మా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తే.. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు. పాడి కౌశిక్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రివెంటివ్ అరెస్ట్ చేసిన మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులను తక్షణమే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.