కౌశిక్‌కు రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియవు : డీకే అరుణ
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియవని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియవని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ పై బీఅర్ఎస్ ఎమ్మెల్సీలు చేసిన అనుచిత వ్యాఖ్యలను డీకే అరుణ గురువారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఖమ్మంలో బీఆర్ఎస్ సభకు లేని కరోనా నిబంధనలు గణతంత్ర దినోత్సవాలకి మాత్రం వచ్చిందా అని ఆమె ప్రశ్నించారు. రాజకీయాల్లో ఒనమాలు తెలియని పాడి కౌశిక్ రెడ్డి.. నోటికి వచ్చిన కూతలు కూయడం ఆ పార్టీ నాయకుల అహంకారానికి నిదర్శనమని నిప్పులు చెరిగారు. గణతంత్ర వేడుకలు జరపని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని డీకే అరుణ ధ్వజమెత్తారు. బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తెలంగాణ ప్రభుత్వానికి వర్తించేలా లేదన్నారు. భారత దేశంలో తెలంగాణ రాష్ట్రం అంతర్భాగం కానట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. గవర్నర్ ఒక మహిళ అనే కనీస గౌరవం లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి: కేసీఆర్‌పై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు