ప్రజలు కోరుకున్న తెలంగాణ రాలే: కాసాని జ్ఞానేశ్వర్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో దుష్ట పాలన పోవాలని, తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ విద్యార్థులు, యువత, అమరవీరులు కలలుగన్న సమసమాజం రాలేదని టీడీపీ

Update: 2023-06-02 14:02 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో దుష్ట పాలన పోవాలని, తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ విద్యార్థులు, యువత, అమరవీరులు కలలుగన్న సమసమాజం రాలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు కోరుకున్న తెలంగాణ రాష్ట్రం రాలేదని, రావాల్సిన అవసరమున్నదని.. అమరవీరుల సాక్షిగా యువత, ప్రజలు ఆలోచించాలని కోరారు.

సమస్యలపై ఎవరైనా నోరెత్తితే పోలీసులు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వీటికి స్వస్తి పలకాల్సిన అవసరమున్నదని, ప్రజలు స్పష్టంగా తెలుసుకున్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు సరైన సమాధానం చెబుతారని అన్నారు. ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఒక చరిత్ర అని.. తెలంగాణ రావడానికి.. ఇవ్వడానికి అసెంబ్లీ నుంచి మొట్టమొదటి ప్రతిపాదనలు ఇచ్చిందే చంద్రబాబు నాయుడని అన్నారు.

నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కోరుకున్నది ఏమిటి అనేది అందరూ ఆలోచించాలన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చామా? యువత ఎందుకు పోరాటాలు చేశారు? అని ఆలోచించాల్సిన అవసరముందన్నారు. ఇష్టారాజ్యంగా ధరలు పెంచడం, ఖజానాను ఖాళీ చేయడం, జీతాలు ఇవ్వలేని పరిస్థితి వంటివి చూస్తున్నామన్నారు.

ప్రభుత్వంలో ఉద్యోగాలు చేస్తున్న బడుగు, బలహీనవర్గాలకు చెందిన వ్యక్తి తనకు ఏరోజు జీతం వస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నారని మండిపడ్డారు. అనంతరం అసెంబ్లీ ఎదుట ఉన్న గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద టీడీపీ నాయకులు నివాళులర్పించారు. అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు జక్కలి ఐలయ్య యాదవ్, రాజునాయక్, దుర్గాప్రసాద్, జ్యోత్స్న, ప్రసూన, లత, మీడియా వ్యవహారాల కో-ఆర్డినేటర్ బియ్యని సురేష్, సాయి తులసి, రవీంద్రాచారి, సైదేశ్వర్ రావు, రాజశేఖర్, ఎం.కె. బోస్, షకీలారెడ్డి, పోలంపల్లి అశోక్, జయరామచందర్, రవీందర్, కాసాని వీరేష్, జీవీజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..