కేసీఆర్ దొంగ అయితే.. CM రేవంత్ గజ దొంగ: కాసం వెంకటేశ్వర్లు ఫైర్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దొంగ అయితే.. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గజదొంగ అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు
దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దొంగ అయితే.. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గజదొంగ అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌కు పరిపాలన చేతకావడం లేదన్నారు. అధికార దాహంతో చిక్కడపల్లి లైబ్రరీలో మోకాళ్ళపై నిలబడి నిరుద్యోగుల వద్ద ఓట్లు అడిగారని, అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఆయనకు జాబ్ క్యాలెండర్ దొరకలేదా..? అని ఎద్దేవాచేశారు. నెలరోజులుగా నిరుద్యోగులను అరెస్టులు చేస్తున్నారని, ఏటా 3 నుంచి 5 శాతం ఉద్యోగులు రిటైర్ అవుతున్నా ఆ పోస్టులను భర్తీ చేయడం లేదని మండిపడ్డారు.
1970లో సాంక్షన్ అయిన పోస్టులనే కంటిన్యూ చేస్తున్నారు తప్ప కొత్త పోస్టులు పెంచడం లేదని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి నిర్యోగులతో చర్చించే దమ్ము లేదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు, నిరుద్యోగులతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని కాసం డిమాండ్ చేశారు. రేవంత్ ముందస్తు హౌస్ అరెస్టులు చేసి కేసీఆర్ కంటే రెండింతల తప్పులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమాలు చేయించలేదా..? అని కాసం మండిపడ్డారు. తమ గోడు వివరించేందుకు నిరుద్యోగులు సెక్రటేరియట్‌కి వెళ్తే వారిని అడ్డుకొని ముందస్తు అరెస్టులు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు.
గతంలో హౌస్ అరెస్టులపై మాట్లాడిన సెల్ఫ్ డిక్లరేషన్ మేధావులు కోదండరాం, ఆకునూరి మురళి, హరగోపాల్ ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదని ఫైరయ్యారు. ప్రభుత్వ తాయిలలకు ఏమైనా లొంగిపోయారా..? అని వెంకటేశ్వర్లు అనుమానం వ్యక్తంచేశారు. యూనివర్సిటీలో చదువుకునే పరిస్థితి లేదని, రేవంత్ యూనివర్సిటీలో చదువుకుని ఉంటే తెలిసేదని చురకలంటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ చదివాడో, ఏం చదువాడో కూడా ఎవరికి తెలియదని ధ్వజమెత్తారు. సెక్రటేరియట్ చుట్టూ పోలీసులు ఉంటున్నారని, ఇదేమైనా పోలీస్ పాలనా..? అంటూ కాసం విరుచుకుపడ్డారు.