కర్ణాటక రిజల్ట్స్.. తెలంగాణలో మూడు పార్టీల్లో హై టెన్షన్
తెలంగాణలో సత్తా చాటాలని భావిస్తున్న మూడు పార్టీలకు కర్ణాటక ఎన్నికల ఫలితాల టెన్షన్ పట్టుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సత్తా చాటాలని భావిస్తున్న మూడు పార్టీలకు కర్ణాటక ఎన్నికల ఫలితాల టెన్షన్ పట్టుకుంది. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీతో సత్తా చాటాలని భావిస్తున్న కేసీఆర్‌తో జేడీఎస్ అధినేత కుమారస్వామి మొదటి నుంచి సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో అక్కడ హంగ్ ఏర్పడి జేడీఎస్ కీలక పాత్ర పోషిస్తే తమకు కలిసి వస్తుందని గులాబీ చీఫ్ భావిస్తున్నారు. తద్వారా బీజేపీని కార్నర్ చేయొచ్చని బీఆర్ఎస్ వర్గాలు యోచిస్తున్నాయి. తాము మద్ధతు ఇస్తున్న పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తే కేంద్రంలో బీఆర్ఎస్‌కు కలిసివస్తుందని గులాబీ బాస్ భావిస్తున్నారు. ఇప్పటికే జేడీఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పలు తెలంగాణ పథకాలను చేర్చిన నేపథ్యంలో పథకాల క్రెడిట్ తమకే దక్కుతుందని, తద్వారా దేశవ్యాప్తంగా పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చిన కేసీఆర్ ప్లాన్‌గా తెలుస్తోంది.
మోడీ మేనియాపైనే బీజేపీ ఫోకస్
కర్ణాటకలో మరోసారి అధికారంలోకి వస్తే మోడీ చరిష్మా ఇంకా తగ్గలేదని స్టేట్‌లో బీజేపీ నేతలు ప్రచారం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. సౌత్‌లో పాగా వేసేందుకు దూకుడుగా వ్యవహరిస్తున్న బీజేపీ కర్ణాటక ఎన్నికల్లో గెలవడం ద్వారా తెలంగాణపై ఇంపాక్ట్ ఉంటుందని బలంగా విశ్వసిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత పూర్తి మెజారిటీ రాకుంటే అనుసరించాల్సిన వ్యూహాలపై కమలం పార్టీ ఫోకస్ చేసింది. గెలుపు విషయంలో బీజేపీ ధీమాతో ఉంది. అయినా ఒక వేళ కన్నడ గడ్డపై ఓడితే సౌత్ లో ఇబ్బందులు తప్పవని ఆ పార్టీలో టెన్షన్ నెలకొంది. కర్ణాటక ఫలితాలు సానుకూలంగా వస్తే మాత్రం దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ మరింత దూకుడుగా ముందుకు సాగనుంది.
ఆ ఫార్ములాను అమలు చేసేందుకు కాంగ్రెస్ స్కెచ్
అయితే అనేక రాష్ట్రాల్లో ప్రాభల్యం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి సైతం ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిష్టాత్మకంగా మారాయి. సర్వేలు కాంగ్రెస్‌కే పట్టం అని తేల్చగా ఫలితాలు ఎలా వస్తాయనేది మాత్రం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఊపు వస్తుందని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు. అక్కడ మేనిఫెస్టో మంత్రాంగాన్ని ఇక్కడ అమలు చేసి తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ పట్ల రాష్ట్రంలో కాస్త పాజిటివిటీ ఉన్న నేపథ్యంలో కర్ణాటక ఫలితాలు ఎలా ఉండనున్నయనే టెన్షన్ హస్తం పార్టీలో నెలకొంది. ఒక వేళ హంగ్ ఏర్పడితే మాత్రం కేసీఆర్ క్లోజ్ ఫ్రెండ్ కుమారస్వామి కింగ్ మేకర్ కానున్నారు. తద్వారా బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీస్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. మరి కర్ణాటక ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారనేది మాత్రం కొన్ని గంటల్లో తేలనుంది.
Also Read.