Huzurabad : అడ్డేలేని మట్టి మాఫియా..తవ్వుకుంటాం.. అమ్ముకుంటాం..!
హుజూరాబాద్ లో మట్టి మాఫియా చెలరేగిపోతుంది.
దిశ, హుజురాబాద్ రూరల్: హుజూరాబాద్ లో మట్టి మాఫియా చెలరేగిపోతుంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల నాయకుల అండ తో పాటు అధికారులు కూడా వత్తాసు పలకడం తో అక్రమ మట్టి దందాకు తెర లేపారు. హుజురాబాద్ మండలం రంగాపూర్ పాండవుల గుట్ట తో పాటు మరో రెండు చోట్ల మైనింగ్ అధికారులు అలైన్మెంట్ (Alignment)లో మట్టి తీసుకోవడానికి డీబీఎల్ కంపెనీ తో పాటు సబ్ కాంట్రాక్టు బెరెండా, సీఎస్కే కంపెనీలకు అనుమతించారు. దీంతో వీరు హుజూరాబాద్ నుంచి వెళుతున్న ఎన్ హెచ్ 563 హైవేకు మట్టిని నిత్యం వందల లారీల్లో సరఫరా చేస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న లోకల్ మట్టి మాఫియా వీరిని బెదిరించి అలైన్మెంట్ లో జేసీబీలు పెట్టి మట్టిని హుజురాబాద్, జమ్మికుంట ,శంకరపట్నం ,ఉప్పల్, కమలాపూర్ ప్రాంతాల్లో సరఫరా చేస్తున్నారు. అడ్డుకుంటున్నా కంపెనీ ప్రతినిధులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. వారు పోలీసులను ఆశ్రయించిన ఫలితం కనబడకపోవడంతో మిన్నకుండిపోతున్నారు.
పొద్దంతా కంపెనీ బండ్లు.. రాత్రంతా మాఫియా బండ్లు..
మట్టిని తీయడానికి పొద్దంతా హైవే పనుల కోసం కంపెనీ లారీలు నడుస్తున్నాయి. రాత్రి 10 గంటల తర్వాత తెల్లవారుజాము వరకు మట్టి మాఫియా టిప్పర్లు నడుస్తూ రోడ్లన్నీ ఛిద్రం చేస్తున్నాయి. లైసెన్స్ లేని డ్రైవర్లు, మైనర్లు మద్యం సేవించి టిప్పర్లను అధిక స్పీడుతో నడుపుతున్నారు. దీంతో రహదారి వెంట వెళుతున్న వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎవరైనా టిప్పర్లను ఆపడానికి ప్రయత్నిస్తే వారిపై కే టిప్పర్లను ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. వాహనాలను నిలిపే ప్రయత్నం చేస్తే దాడులు చేసేందుకు వెనకాడడం లేదు.
పట్టించుకోని రెవెన్యూ ,పోలీస్, మైనింగ్ అధికారులు..
రాత్రిళ్ళు మట్టి మాఫియా టిప్పర్లు వందల సంఖ్యలో మట్టి తరలిస్తుంటే రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినవస్తున్నాయి. పోలీస్ శాఖకు ఫిర్యాదు చేస్తే అది తమ పని కాదని దానికి ప్రత్యేక శాఖ ఉందని తెలుపుతున్నట్లు కొందరు ఫిర్యాదుదారులు పేర్కొంటున్నారు. రెవెన్యూ (Revenue)శాఖకు ఫిర్యాదు చేస్తే మాకు గతంలో ఉన్న సిబ్బంది లేరని మట్టి మాఫియా చేస్తున్న వ్యక్తుల సమాచారం చట్టపరమైన చర్యల కోసం పోలీసులకు ఇచ్చామని పేర్కొంటున్నారు. మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేస్తే తమకు ప్రభుత్వం చాలా పనులు అప్పగించిందని సరైన సిబ్బంది లేరని పేర్కొనడం శోచనీయమని ఫిర్యాదుదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా శాఖల మధ్య సమన్వయం లేకపోవడం మట్టి మాఫియా కు వరంగా మారింది. ఇలా అధికారులు ఒకరిపై ఒకరు నెట్టుకోవడం వెనుక మట్టి మాఫియా వద్ద మామూలు గుంజుతున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
కరుగుతున్న గుట్టలు..
హుజూరాబాద్ మండలం రంగాపూర్ శివారులోని పాండవుల గుట్ట తో పాటు మరో రెండు గుట్టలు మట్టి మఫియాతో కరిగిపోతున్నాయి. అలాగే మందాడి పల్లె గ్రామ దళితులకు ఇచ్చిన లావుని పట్టా భూములు బొందల గడ్డలుగా మారుతున్నాయి. ఈ ప్రాంతంలో తవ్విన మట్టిని మట్టి మాఫియా ప్రైవేటు (private)వ్యక్తులకు ట్రిప్పుకు రూ.2 వేల నుంచి 3 వేల చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయలు చెల్లించకుండా లక్షల రూపాయలు గండి కొడుతూ మట్టి అక్రమార్కులు లక్షలు సంపాదిస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో హుజూరాబాద్ ప్రాంతంలో పర్యావరణ సమతుల్యత కనుమరుగవుతుందని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు..: ఆరేపల్లి ఎల్లయ్య ,మందాడి పల్లి మాజీ సర్పంచ్
స్థానిక అధికారుల నుంచి జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా మట్టి మాఫియా, బీపీఎల్ కంపెనీ అక్రమాలపై ఫిర్యాదు చేశా. విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఇప్పటివరకు మట్టి మాఫియాను నిలువరించలేదు. డీబీఎల్ కంపెనీ పై ఎలాంటి చర్యలు లేవు. మా గ్రామానికి చెందిన 20 మంది దళితులకు 18 ఎకరాలు ప్రభుత్వం లావుని పట్టాలు అందించింది. ఈ భూములను వ్యవసాయానికి పనికి రాకుండా మట్టి మాఫియా, డీబీఎల్ కంపెనీ బొందల గడ్డగా మారుస్తుంది. అధికారులు చర్యలు తీసుకొని ఎడల ఆందోళనలకు సిద్ధమవుతాం.