తన భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారని.. చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య

తన భూమి అక్రమ పట్టా చేసుకోవడమే కాకుండా చంపుతానని బెదిరిస్తూ.. మానసికంగా ఇబ్బందులకు గురి చేయడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

Update: 2024-10-30 15:15 GMT

దిశ, రామడుగు: తన భూమి అక్రమ పట్టా చేసుకోవడమే కాకుండా చంపుతానని బెదిరిస్తూ.. మానసికంగా ఇబ్బందులకు గురి చేయడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన రామడుగు మండలం వెలిచాల గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన దైవాల రమేష్ తల్లి వరమ్మ 2004 సంవత్సరంలో 35 గుంటల భూమిని కొత్తపెల్లి గ్రామానికి చెందిన పల్లేర్ల దేవిక నుంచి కొనుగోలు చేసింది. అప్పటినుండి దైవాల రమేష్ అందులో పంటలు పండిస్తున్నాడు. ఈ క్రమంలో దైవాల రమేష్‌కు తెలియకుండా పల్లేర్ల దేవిక ఇదే భూమిని అక్రమంగా కొత్తపెల్లి గ్రామానికి చెందిన సింగు హరి బాబుకు తప్పుడు రిజిస్ట్రేషన్ చేసింది.

విషయం తెలిసిన రమేష్ వారిని రిజిస్ట్రేషన్ విషయం గురించి అడిగాడు. దీంతో గత 15 రోజుల నుంచి పల్లెర్ల దేవిక, సింగు హరిబాబు, సింగు శ్రీకాంత్, సింగు శ్రీనివాస్‌లు కలిసి రమేష్ తో పాటు అతని కుటుంబ సభ్యులను కూడా చంపుతానని బెదిరిస్తూ.. మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. దీంతో దైవాల రమేష్ తీవ్ర మనోవేదనకు గురై జీవితంపై విరక్తి చెంది బుధవారం ఉదయం వెలిచాల గ్రామంలోని అయ్యవారి కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య శ్రీలత ఫిర్యాదు మేరకు ఎస్సై శేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Similar News