రేకుర్తి లక్ష్మీ నరసింహ స్వామి గుట్ట పై అసాంఘిక కార్యకలాపాలు..!

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రేకుర్తి 19వ డివిజన్ లో గల గుట్టపై స్వయంభూగా వెలసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయాన్ని కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ పవిత్రమైన దేవాలయాన్ని అపవిత్రం చేస్తున్నారు.

Update: 2024-10-06 11:35 GMT

దిశ, కరీంనగర్ రూరల్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రేకుర్తి 19వ డివిజన్ లో గల గుట్టపై స్వయంభూగా వెలసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయాన్ని కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ పవిత్రమైన దేవాలయాన్ని అపవిత్రం చేస్తున్నారు. గుట్ట పరిసర ప్రాంతాల్లో మందుబాబులు అర్ధరాత్రి సమయంలో మద్యం, గంజాయి సేవించి, కాలి మద్యం సీసాలను గుట్ట ఘాట్ రోడ్డుపై పగులగొట్టి వారి శునకనందాన్ని పొందుతున్నారు. నరసింహ స్వామిని దర్శించుకునేందుకు ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారని, ఇలాంటి పవిత్రమైన ఆలయ ప్రాంతంలో మందుబాబులు మద్యం, మాంసం సేవించి సీసాలు పగలగొట్టి వికృత చేష్టలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా ఇటీవల కొందరు యువకులు ఓ యువతిని అర్ధరాత్రి సమయంలో గుట్టపైకి తీసుకురాగా అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి, వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అక్కడి నుంచి పరారైనట్లు విశ్వనీయ సమాచారం.

సంఘటన స్థలానికి చేరుకున్న కొత్తపల్లి పోలీసులు నెంబర్ ప్లేట్ లేని రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే గుట్ట ఘాట్ రోడ్డుపై గత వారం రోజులుగా ఆ రెండు ద్విచక్రవాహనాలు అక్కడే ఉంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ వాహనాలు అసలు ఎవరివి..? ఎవరైనా దొంగలు చోరీకి పాల్పడి గుట్టుచప్పుడు కాకుండా అక్కడ దాచి ఉంచారా..? లేక దాని వెనకాల ఇంకేమైనా కోణం ఉందా అనేది పోలీసులు నిగ్గు తేల్చాల్సి ఉంది. గతంలో గుట్ట ఆవరణలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా రేకుర్తి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గుట్ట వద్ద వాచ్ మెన్ ని నియమించారు. కానీ ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ లో రేకుర్తి గ్రామాన్ని విలీనం చేశారు.

దీంతో ఆ స్థానంలో అక్కడ ఎవరిని నియమించకపోవడంతో కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. కరీంనగర్ కు కూతవేటు దూరంలో ఉన్న రేకుర్తి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుట్టను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని అప్పటి రేకుర్తి మాజీ సర్పంచ్ నందేల్లి పద్మ - ప్రకాష్ స్థానిక బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చొరవతో గుట్ట పైకి ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేశారు. అయితే నిర్మాణం పూర్తి చేసుకున్న గుడిలో దేవుళ్లను ప్రతిష్టాపన చేయాల్సిన కార్యక్రమం పెండింగ్ లో ఉంది. ఏది ఏమైనా గుట్ట ఆవరణలో అసాంఘిక కార్యకలాపాలు మళ్లీ పునరావృతం కాకుండా సీసీ కెమెరాల నిఘా తో పాటు, రాత్రి వేళల్లో పోలీసుల గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు.


Similar News