వేలాడితేనే గమ్యం చేరేది..

తమ గమ్యం చేరాలంటే.. ప్రమాదం అంచున ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Update: 2024-12-02 08:52 GMT

దిశ, తంగళ్ళపల్లి : తమ గమ్యం చేరాలంటే.. ప్రమాదం అంచున ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ ఒకవైపు ఫుడ్ బోర్డు ప్రయాణం ప్రమాదకరమని ప్రచారం చేస్తున్నా.. మరోవైపు బస్సుల సంఖ్య తగ్గించడంతో ప్రయాణికులు తిప్పలు పడక తప్పడం లేదు.

పెరిగిన ప్రయాణికులు.. తగ్గిన బస్సులు..

ఆర్టీసీ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. దీంతో బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరిగిపోయింది. దీనికి తోడు బస్సుల సంఖ్య తగ్గించడంతో ఫుట్ బోర్డ్ ప్రయాణాన్ని ప్రోత్సహిస్తున్నట్టవుతుంది. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు లేక బస్సులన్నీ కిక్కిరిసి వెళ్తున్నాయి.

విద్యార్థుల బాధలు వర్ణణాతీతం..

స్కూల్ కాలేజీలకు వెళ్లేందుకు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు మాత్రం వర్ణణాతీతంగా మారాయి. ఉదయం వేళ బస్సులన్నీ కిక్కిరిసి ఉండడంతో గత్యంతరం లేక ప్రమాదకరంగా.. ఫుట్ బోర్డు మీద వేలాడుతూ ప్రయాణం చేస్తున్నారు. ఒకవేళ బస్ సడన్ బ్రేక్ వేస్తే పెను ప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రయాణికులతో పాటు విద్యార్థుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలనే డిమాండ్లు వస్తున్నాయి. అయినప్పటికీ ఆర్టీసీ అధికారులు, పాలకులు పట్టనట్టు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

స్కూలుకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు మాత్రం మరింత ఇక్కట్లు పడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రంలో చదువుకునేందుకు సైతం రోజు వేలాది మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం బస్సులో కిక్కిరిసి ఉండడంతో స్కూలుకు, కాలేజీలకు వెళ్లాలని తాపత్రయంతో విద్యార్థులు హడావిడిగా బస్సులు ఎక్కుతూ ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్న దృష్ట్యా బస్సుల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు, విద్యార్థులు కోరుతున్నారు.


Similar News