రైతన్న చెంతకు...రాజన్న కోడెలు

దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో కోడెలను రైతులకు అందించేందుకు శ్రీకారం చుట్టారు.

Update: 2024-07-03 12:03 GMT

దిశ, వేములవాడ : దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో కోడెలను రైతులకు అందించేందుకు శ్రీకారం చుట్టారు. దీంతో కోడెల సంరక్షణ సులభమవడంతో పాటు రైతులకు ఉపాధి లభించనుంది.

లాంఛనంగా ప్రారంభించిన ప్రభుత్వ విప్ 

రాజన్న కోడెలను రైతులకు ఇచ్చే కార్యక్రమాన్ని బుధవారం తిప్పాపూర్ గోశాలలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతులమీదుగా లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న ఒక్కో రైతుకు రెండు (జోడి) కోడెలను అందించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరు గాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో భక్తులు ప్రత్యేక అనుబంధంతో ఎక్కడెక్కడ నుంచో వేములవాడకు వచ్చి తమ ఆకాంక్షలు తీరాలని కోడె కడతారని తెలిపారు. ప్రతి నిత్యం భక్తుల కోలాహలంతో స్వామి, అమ్మ వార్ల దర్శనం తో పాటు కోడె మొక్కులు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. వేములవాడ దేవస్థానం గోశాలలో 400 గోవుల సామర్థ్యం

    ఉందని, కానీ ప్రస్తుతం అందులో 1500 పైగా కోడెలు, గోవులు ఉండటం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వీటిని అర్హులైన పేద రైతులకు, ఇతర గోశాలలకు ఉచితంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో అర్హులైన పేద రైతులకు కోడెలను అందిస్తున్నామని అన్నారు. గోశాల నుంచి పంపిణీ చేసే కోడెలు, ఆవులు ఇతరత్రా పనులకు వినియోగించుకోకుండా అర్హులకు మాత్రమే అందేలా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వారి ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా గుర్తించడం జరిగిందని అన్నారు. వ్యవసాయం చేసే పేద రైతులకు 2 కోడెలను ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. కోడెలను పొందిన రైతులు వీటిని జాగ్రత్తగా దైవ రూపంగా భావించి చూసుకోవాలని, వీటిని ఇతరులకు విక్రయించడానికి వీలు లేదని, సొంత వ్యవసాయానికి మాత్రమే వినియోగించుకోవాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీటి వినియోగం పై పకడ్బందీ అంగీకార పత్రం రూపొందించామని అన్నారు. అర్హులైన రైతులకు ఉచితంగా

    కోడల పంపిణీ కార్యక్రమం ప్రతి మాసం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని అన్నారు. వేములవాడ దేవస్థానం వద్ద 400 కోడెలు అందుబాటులో పెట్టుకొని మిగిలిన కోడెలను ప్రతి నెలా నిరంతరాయంగా ఉచిత పంపిణీ చేస్తామని తెలిపారు. వేములవాడ ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ఆలయ ఈవో, కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపించాలని విప్ సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ దేవస్థానంలోని కోడెలను పేద రైతులకు ఉచితంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఒప్పించారని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించి, అర్హులైన రైతులను ప్రత్యేక కమిటీ ద్వారా క్షేత్రస్థాయిలో విచారించి ఎంపిక చేశామని అన్నారు. దేవస్థానం గోశాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ. కోటి 11 లక్షలు మంజూరు చేసిందని,

    వీటితో గోశాలలో కోడెలకు అదనపు షెడ్ల నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఆలయ ఈవో వినోద్ రెడ్డి మాట్లాడుతూ రాజన్న ఆలయ చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యయమని, కోడెలను రైతులకు ఇవ్వడమనేది చాలా చక్కటి ఆలోచన అని, ఇంత చక్కటి కార్యక్రమంలో తాను భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. పేద రైతుల అవసరాల మేరకు కోడెలను అందించడం జరుగుతుందని, ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు. ఇంత చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ లు హరి కిషన్, శ్రీనివాస్, నవీన్ కుమార్, జయ కుమారి, ఈఈ రాజేష్, డీఈ రఘు నందన్, పర్యవేక్షకులు మూర్తి, శ్రీ రాములు, పశు వైద్యాధికారి ప్రశాంత్ రెడ్డి, గోశాల కమిటీ సభ్యుడు మోటూరి మధు తదితరులు పాల్గొన్నారు. 


Similar News